Aqua Farmers: ఆక్వా పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని, ఆక్వా రైతుల్లో ఐక్యత లేకపోవడం వల్ల ఎగుమతిదారులకు లాభాలు తెచ్చిపెడుతోందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆక్వా అధ్యక్షుడు సీహెచ్ఎసి సూర్యారావు అన్నారు. రైతులు ఐక్యంగా పోరాడితేనే వారు దిగి వస్తారని అభిప్రాయపడ్డారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలంలోని ఆక్వా రైతులు బాణాపురంలో సమావేశం అయ్యారు. మార్కెట్ ధరలకు కనీసం రొయ్యల మేత కూడా రావడం లేదని.. దీని వల్ల లక్షల్లో నష్టాలు వస్తున్నాయని అన్నారు. కోడి గుడ్డు రైతులకు ఎన్ఐసిసీ ఉన్నట్లు ఆక్వా రైతులకు ఎన్ఎఎఫ్ సీగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని, రొయ్యలకు డొమెస్టిక్ మార్కెట్ ఇండియాలోనే అభివృద్ధి చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 


రొయ్యల ధరలు స్థిరీకరించాలి..


2030 దాటికి ప్రపంచంలో 30 శాతం రెడ్ మీట్ వాడకం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారని, అందుకు అనుగుణంగా ఆక్వా రైతులు ఆలోచనలు ఇవ్వాలన్నారు. ఆక్వా రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనీ, ఆక్వా కంపెనీలు రొయ్యల ధరలు స్థిరీకరించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ధరలు ఇలా ఉంటే భవిశ్యత్ లో పంట విరామం ప్రకటించేందుకు వెనకడుగు వేయబోమని సమావేశం తీర్మానించింది. సమావేశంలో ముదునూరి సతీష్ రాజు, భూపతీరాజు బులిరాజు, దాట్ల పృథ్వీరాజు, పిన్నంరాజు శ్రీనివాసరాజు, లంకలపల్లి బుల్లియ్య, ఏలూరి ఆదినారాయణ తదితర రైతులు పాల్గొన్నారు.


ఇదేం ఖర్మ.. ఆక్వా రైతులకు రాష్ట్రస్థాయి సదస్సు.. 


ఇటీవలే టీడీపీ "ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి" రాష్ట్ర స్థాయి సదస్సును కూడా నిర్వహించింది. తెలుగుదేశం హయాంలో దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రంగం.. నేడు సీఎం జగన్‌ రెడ్డి చర్యలతో పతనావస్థకు చేరుకుందని కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకే గురువారం ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ‘‘ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి’’ అనే అంశంపై నేతలు మాట్లాడారు. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఆక్వా రైతు సంఘం నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని చర్చించారు. 


అలాగే ఈ సదస్సుకు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడితో పాటు ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించి ఉద్యమ కార్యాచరణను రూపొందించుకున్నారు. ఆక్వా రైతులకు రూ.1.50 కే విద్యుత్‌ సరఫరా చేస్తానని జగన్‌రెడ్డి హామీ ఇచ్చి రైతులను వంచించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా విద్యుత్‌ కోతలతో ఆక్వా రంగాన్ని జగన్‌రెడ్డి నిండా ముంచారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలతో ఆక్వా రైతులకు మద్దతు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అనేక షరతులతో సబ్సిడీలు ఎత్తివేసి ఆక్వా రైతులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. రూ.5 వేల కోట్ల జెట్యాక్స్‌తో ఆక్వా రైతాంగాన్ని నాశనం చేస్తున్న సీఎం జగన్ చర్యలకు వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న పోరాటంలో ఆక్వా రైతులందరూ పాల్గొనాలని కోరుతున్నట్లు వివరించారు.