Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ పాదయాత్రలో అపశ్రుతి, సొమ్మసిల్లి కిందపడ్డ తారకరత్న

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 27 Jan 2023 12:58 PM
CM KCR on Jamuna Death: జమున మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ సినీ నటి, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, మాజీ ఎంపీ  జమున మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సిఎం అన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడం లోనే కాకుండా హిందీ సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్నిపొందిన జమున గారు, నటిగా కళాసేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా  ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Nara Lokesh Padayatra: నారా లోకేశ్ పాదయాత్రలో తొలిరోజే అపశ్రుతి, కిందపడ్డ తారకరత్న

నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తొలిరోజే ఓ అపశ్రుతి జరిగింది. ఈ యాత్ర తొలిరోజున నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నారు. ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే స్థానిక టీడీపీ నేతలు దగ్గర్లోని కేసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాక పాదయాత్ర ప్రారంభం అయింది. అనంతరం కొద్ది దూరం నడిచాక మసీదులో లోకేశ్ ప్రార్థనలు చేశారు. తారకరత్న కూడా అందులో ఉన్నారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఒత్తిడిని తట్టుకోలేక తారకరత్న సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది.

Kakani Govardhan Reddy: లోకేశ్ యాత్రపై కాకాణి గోవర్థన్ రెడ్డి సెటైర్లు

నారా లోకేష్ యువగళం పాదయాత్ర వల్ల టీడీపీకి మేలు జరగకపోగా కీడు జరుగుతుందని, రాగా పోగా వైఎస్ఆర్ సీపీకే ఎక్కువ మేలు జరుగుతుందని లాజిక్ చెప్పారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. జయంతికి వర్థంతికి తేడా తెలియని వాడు ఏం మాట్లాడతాడోనని టీడీపీ శ్రేణులు భయపడుతున్నాయని అన్నారు. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నాయన్నారు. లోకేష్ యాత్రపై వైసీపీ ఆలోచించే పరిస్థితిలో లేదని, అసలా యాత్ర వల్ల ఫలితం ఉండదన్నారు. దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్.. సీఎం కొడుకు హోదాలో పోటీ చేసి ఓడిపోయారని, ఇప్పుడాయన యాత్రల పేరుతో జనంలోకి వచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి పూర్తిగా మతి భ్రమించిందని, అందుకే ఆయన మెడకి మైక్ పెట్టుకున్నారని, చేతిలో పేపర్లు పట్టుకోడానికి వీలుగా మైక్ మెడకు వేసుకున్నారని, పేపర్లు చూసి ప్రసంగం చెబుతున్నారని అన్నారు కాకాణి.

BRS News: కొడంగల్‌లో బీఆర్ఎస్ కు గట్టి షాక్

  • కొడంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

  • కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి

  • గురునాథ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరనున్న కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప

  • ఏడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన గురునాథ్ రెడ్డి కొడంగల్ లో తిరుగులేని నేత

  • గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుపులో కీలక పాత్ర పోషించిన గురునాథ్ రెడ్డి

  • సొంతంగా 30 వేల ఓట్లు కలిగి ఉన్న నేత గురునాథ్ రెడ్డి పార్టీ వీడడంతో బీఆర్ఎస్ కు గట్టి షాక్

  • భేటీలో పాదయాత్రపై గురునాథ్ రెడ్డితో చర్చించిన రేవంత్ రెడ్డి

ఆత్మ పరిశీలన చేసుకోండి: ప్రధాని మోదీ

ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు మీ సామర్థ్యాన్ని, మీ ఆకాంక్షలను, మీ లక్ష్యాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆపై ఇతరులు మీ నుంచి ఆశిస్తున్న అంచనాలతో వాటిని కనెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి.

సమయపాలనపై ప్రధాని మోదీ సూచనలు

పరీక్ష పే చర్చ సందర్భంగా టైమ్ మేనేజ్ మెంట్ పై చిట్కాలు ఇచ్చిన ప్రధాని మోదీ.. 'మీకు తక్కువ నచ్చిన సబ్జెక్టుకు ముందుగా సమయం ఇచ్చేలా చూడండి. ఆ విధంగానే షెడ్యూల్ వేసుకోండి. తర్వాత నచ్చిన సబ్జెక్టుకు సమయం ఇవ్వండి.

పని చేయకపోతేనే అలసట: ప్రధాని మోదీ

కేవలం పరీక్షలకే కాదు జీవితంలో టైమ్ మేనేజ్ మెంట్ పై కూడా అవగాహన ఉండాలి. సకాలంలో పనులు పూర్తి కాకపోవడం వల్ల పనులు చాలా స్లోగా సాగుతాయి. పనిలో ఎప్పుడూ అలసట ఉండదు, పనిలో సంతృప్తి ఉంటుంది. పని చేయకపోవడం వల్లే అలసట వస్తుంది. చాలా పని మిగిలి పోతుంది: ప్రధాని నరేంద్ర మోడీ

ఒత్తిళ్లకు లొంగొద్దు: ప్రధాని మోదీ

మీరు బాగా చేసినప్పటికీ, ప్రతి ఒక్కరూ మీ నుంచి కొత్తదాన్ని ఆశిస్తారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కానీ ఆ ఒత్తిడితో మనం ఒత్తిడికి లోనవుతామా? మీరు మీ కార్యాచరణపై దృష్టి పెడితే, మీరు అటువంటి సంక్షోభం నుంచి బయటపడతారు. ఒత్తిడికి గురికావద్దు: ప్రధాని మోదీ

ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండండి: ప్రధాని మోదీ

పరీక్షా పే చర్చా సందర్భంగా ప్రధాని మోడీ ఒత్తిడి లేకుండా ఉండమని సూచించారు. "మీలాగే, మేము కూడా మా రాజకీయ జీవితంలో ఒత్తిడి పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ అనుకూలంగానే వస్తాయని ఆశిస్తుంటాం. మీరు కూడా బాధ పడొద్దు. ఒత్తిడి లేకుండా, సంతోషంగా ఉండటంతోపాటు మీ అత్యుత్తమైన పని తనాన్ని చూపించే ప్రయత్నం చేయండి. 

పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావద్దు: ప్రధాని మోదీ

చదువు పట్ల తల్లిదండ్రులు తమ పిల్లపై ఒత్తిడి తీసుకురావద్దని ప్రధానమంత్రి సూచించారు. అదే టైంలో విద్యార్థులు కూడా తమ శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయద్దని సూచించారు మోదీ. 

ఆ లేఖలు స్ఫూర్తినిస్తాయి: ప్రధాని

ఏటా చాలా మంది తనకు లెటర్స్ రాస్తుంటారని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. సలహాలు అడుగుతుంటారని వివరించారు. ఇది తనకు చాలా స్ఫూర్తిని ఇస్తుందన్నారు మోదీ.

పరీక్షలను ఎదుర్కోవడానికి ప్రధాని చిట్కాలు

పరీక్షపే చర్చ సందర్భంగా ప్రధాని మోదీ విద్యార్థులకు కొన్ని టిప్స్ చెప్పారు. పెన్ను లేదా పెన్సిల్‌తో ఓ డైరీ రాసుకోమన్నారు. విద్యార్థులు రోజా గడిపే సమయాన్ని నోట్ చేసుకోమన్నారు. 

'పరీక్షా పర్ చర్చా' కూడా సవాలే: ప్రధాని మోదీ

'పరీక్షా పే చర్చా' కూడా తనకు సవాలే అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో కోట్లాది మంది విద్యార్థులు దీని కోసం ఎదురు చూస్తున్నారని.. దీన్ని ఎదుర్కోవడం చాలా ఆనందాన్నిస్తుందన్నారు. ఆస్వాదిస్తా అన్నారు. కుటుంబాలు తమ పిల్లలపై ఆశలు పెట్టుకోవడం సహజం, కానీ సామాజిక హోదాను కాపాడుకోవడం కోసం అయితే అది ప్రమాదకరంగా మారుతుందన్నారు ప్రధాని మోదీ. 

Yuva Galam Padayatra: యువగళం పాదయాత్రలో స్వల్ప షెడ్యూల్ మార్పు

  • నేడు కుప్పంలో యువగళం పేరుతో‌ లోకేష్ పాదయాత్ర ప్రారంభం

  • మధ్యాహ్నం 12 గంటలకు వరదరాజస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న లోకేష్

  • మధ్యాహ్నం 12:30 నిమిషాలకు దేవాలయం నుండి పాదయాత్ర మొదటి అడుగు ప్రారంభం

  • పాత మసీదు, బస్టాండు, కుప్పం రోడ్డు మీదుగా సాయంత్రం 4 గంటలకు పార్టీ ఆఫీసుకు చేరుకోనున్న లోకేష్

  • టీడీపీ కార్యాలయంలో ముప్పై నిమిషాల పాటు విరామం

  • టీడీపీ కార్యాలయం వద్ద సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గంట పాటు బహిరంగ సభ

  • 5:50 నిమిషాలకు ఐస్ ల్యాండ్ జంక్షన్, ప్రభుత్వ ఆసుపత్రి, శెట్టిపల్లి, బెగ్గిలిపల్లె, మీదుగా పీఈఎస్ మెడికల్ కళాశాలకు చేరుకోనున్న లోకేష్

  • రాత్రి 8 గంటలకు పీఈఎస్ మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్యాంపులో బస చేయనున్న నారా లోకేష్

  • మొదటి రోజు మొత్తం 8.4 కిలో మిటర్లు పాదయాత్ర చేయనున్న నారా లోకేష్

  • రేపు ఉదయం 8 గంటలకు పీఈఎస్ మెడికల్ కళాశాల నుండి పాదయాత్ర ప్రారంభించనున్న నారా లోకేష్

జమున మృతి పట్ల రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం

సినీనటి జామున మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. జమున మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని రేవంత్ రెడ్డి అన్నారు. వివిధ భాషలలో వందలాది సినిమాలలో నటించడమే కాకుండా అగ్ర తరాల పక్కన నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జమున అని అన్నారు. జమున ఆత్మకు శాంతి చేకూరాలని భాగవంతుణ్ణి కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

సీనియర్ నటి జమున కన్నుమూత

సీనియర్ నటి జమున... కన్నుమూశారు. 86 ఏళ్ల జమున.... హైదరాబాద్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1936 ఆగస్టు 30న హంపీలో జమున జన్మించారు. తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో సుమారు 198 చిత్రాల్లో జమున నటించారు. 1953లో గరికపాటి రాజారావు తీసిన పుట్టిల్లు... జమున తొలి సినిమా. కానీ ఎల్వీ ప్రసాద్ 1955లో తీసిన మిస్సమ్మ ద్వారా ఆమెకు తొలి బ్రేక్ వచ్చినట్టైంది. 1989లో రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా విజయం సాధించారు. ఫిలింఫేర్ అవార్డులు, లైఫ్ టైం అచీవ్ మెంట్ సహా జమున ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్ కు జమున భౌతికకాయాన్ని తరలించనున్నారు

సానియా భావోద్వేగం... అందర్నీ ఏడిపించేసిన టెన్నీస్ స్టార్

ఆస్ట్రేలియా ఓపెన్‌లో వీడ్కోలు ప్రసంగంలో మాట్లాడుతూ సానియా మీర్జా చాలా భావోద్వేగానికి గురయ్యారు. తాను 18 ఏళ్ల వయసులో టెన్నీస్ కెరీర్ స్టార్ట్ చేశానని చెబుతూ కంటనీరుపెట్టుకున్నారు. అక్కడే ఉన్న ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. 

ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఓటమితో ముగించిన సానియా మీర్జా

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా, బోపన్న జోడీ ఓటమి పాలైంది. స్టెఫాని, మాటస్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో ఓడిపోయిందీ జోడీ. సానియా మీర్జాకు ఇదే ఆఖరి గ్రాండ్‌ స్లామ్‌. 

Background

జనవరి చివరి వారంలో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెల 27న ఉపరితల ఆవర్తనంగా ఏర్పడి, 28న అల్ప పీడనంగా మారుతుందని తెలిపారు. అయితే, శ్రీలంకకు దక్షిణ భాగంలో ఇది ఏర్పడడం వల్ల ఆంధ్రా, తెలంగాణపై దీని ప్రభావం ఉండకపోవచ్చని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణ ప్రాంతంలో తూర్పు, ఆగ్నేయం దిశల నుంచి గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాతో పాటు యానాం ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు మాత్రం పొగమంచు అంతగా ఉండదని వివరించారు. అంతా పొడి వాతావరణమే ఉంటుందని తెలిపారు. రేపు, ఎల్లుండి కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు.


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎక్కువగా పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. రాయలసీమలోనూ ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు.


ఏపీ వ్యాప్తంగా సాధారణంగా చలి ఉంటుందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు.









ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘మనకు ఎలా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందో, అలాగే  హిమాలయాలు, మధ్య ఆసియా మీదుగా కూడ భూమిలోనే అల్పపీడనాలు ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ఇరాన్, ఇరాక్ లో ఉన్న ఎడారిలో ఏర్పడి హిమాలాయాలు, ఉత్తర భారత దేశం వైపుగా వెళ్తుంది. దీనినే మనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటాము. అంటే చిన్నగా పశ్చిమ గాలులు అని అనవచ్చు. ఇది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల వైపు ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైనా బలంగా ఏర్పడినప్పుడు మాత్రం భాగా ప్రభావం చూపుతుంది’’ అని వివరించారు.


ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. రానున్న 5 రోజుల్లో ఢిల్లీతోపాటు పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వదులుగా, పొరలుపొరలుగా ఉండే దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. త్వరలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు చెప్పారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. నేటి నుంచి రాష్ట్రమంతా చలి సాధారణంగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఎక్కడా ఎల్లో అలర్ట్ లు జారీ చేయలేదు. మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. కొన్ని చోట్ల పొగమంచు అధికంగా ఉంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 30 డిగ్రీలు, 18.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.