Breaking News Live Telugu Updates: హైదరాబాద్‌ పాతబస్తీలో హై అలర్ట్- భద్రతా బలగాల ఫ్లాగ్‌ మార్చ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రిఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 24 Aug 2022 06:08 PM
చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత-

కుప్పంలో చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు చేరుకున్న చంద్రబాబు రామకుప్పం మండలం, కొంగనపల్లి నుంచి తన పర్యటనను ప్రారంభించారు  చంద్రబాబు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికాయి. కొంగనపల్లి నుంచి కొల్లుపల్లి, జల్దిగానిపల్లి మీదుగా రోడ్ షో రామకుప్పానికి చేరనుంది. రామకుప్పంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాయుడు పర్యటించే ప్రాంతాల్లో వైసీపీ నాయకులు తమ పార్టీ జెండాలు కట్టారు. ముఖ్యంగా రామకుప్పం మండలం కొల్లుపల్లెలో స్థానిక వైసిపి నేతలు దారిపొడవున పార్టీ జెండాలు కట్టారు. వాటిపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  వాటిని తొలగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల పట్టించుకోకపోయేసరికి... వాళ్లే స్వయంగా జెండాలు పీకే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. పోలీసులు, వైసీపీ నేతల తీరుకు నిరసనగా టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు.  

నల్గొండ జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్- ఒకరు సజీవదహనం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం కారణంగా కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలినట్టు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రస్తుతానికి ఒకరు మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. కానీ మరికొందరు చనిపోయినట్టు అక్కడ పని చేసేవాళ్లు చెబుతున్నారు. చాలా మంది గాయపడినట్టు కూడా తెలియజేస్తున్నారు. ప్రమాదం కారణంగా పొగ కమ్ముకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 

హైదరాబాద్‌ పాతబస్తీలో హై అలర్ట్- భద్రతా బలగాల ఫ్లాగ్‌ మార్చ్

హైదరాబాద్‌లోని పాతబస్తీలో హై అలర్ట్‌ ప్రకటించింది. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది ప్రభుత్వం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ర్యాపిడ్‌ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్‌, లోకల్‌ పోలీసులు పాతబస్తీలో భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. 

శాంతి భద్రతలపై సీఎం అత్యవసర సమావేశం

తెలంగాణలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో ఈ భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్‌, ఇద్దరు ఐజీలు , మూడు కమిషనరేట్‌ సీపీలు పాల్గొన్నారు. 

బండి సంజయ్‌ యాత్రపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

బండి సంజయ్ యాత్రపై విచారణ చేపట్టిన హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పాదయాత్ర ఆపేయాలన్న జనగామ పోలీసుల నోటీసులపై బీజేపీ న్యాయపోరాటం చేస్తోంది. కోర్టులోనే తేల్చోవాలని నిర్ణయించి తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు బండి సంజయ్. దీనిపై 3.45 గంటలకు విచారించిన హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 

హైదరాబాద్ సిటీ సివిల్‌ కోర్టులో కవిత పిటిషన్ విచారణ

లిక్కర్ స్కాంలో టీఆర్‌ఎస్ కవిత ఎమ్మెల్సీ కవిత పేరు ఉందన్న బీజేపీ ఆరోపణలపై కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని సిటీసివిల్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. నిరాదరణ ఆరోపణలతో తన అభిమానుల్లో, ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని కవిత ఆరోపించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వలని ఆమె తరఫున లాయర్లు  రిక్వస్ట్ చేశారు. 

తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

ఎంఐఎంతో కలిసి తెలంగాణలో మత ఘర్షణలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేసిందని ఆరోపించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. రెండు మూడు రోజుల్లో అలాంటివి చేసి బీజేపీని దోషిగా చూపించబోతున్నారని అన్నారు. దీని కోసం ఎమ్మెల్యేలకు, వారి బిడ్డలకు కర్రలు ఇచ్చి రోడ్లపైకి పంపిస్తున్నారని అన్నారు. నిరసన దీక్ష తర్వాత మాట్లాడిన ఆయన... టీఆర్‌ఎస్‌ కాదు... ఎవరు అడ్డం వచ్చినా యాత్ర ఆపేది లేదన్నారు బండి సంజయ్. 

గ్రానైట్ పరిశ్రమలకు గుడ్ న్యూస్- స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం

చీమకుర్తిలో పర్యటిస్తున్న సీఎం జగన్... గ్రానైట్ పరిశ్రమలకు హ్యాపీ న్యూస్ చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు స్లాబ్ సిస్టం తీసుకొస్తూ 58వ నెంబర్ జీవో జారీ చేసినట్టు వివరించారు. వైఎస్ హయంలో తీసుకొచ్చిన ఈ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీని వల్ల చిన్న చిన్న గ్రానైట్‌ పరిశ్రమలు కష్టాల్లోకి వెళ్లిపోయాయన్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు ఏడువేల యూనిట్లకు లబ్ధి చేకూరనుందని అభిప్రాయపడ్డారు. సింగిల్ బ్లేడ్‌కు 25వేల రూపాయలు, మల్టీ బ్లేడ్‌కు 54వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. రాయలసీమలో అయితే 22వేలు, 44వేలు ఇస్తామని ప్రకటించారు. దీని వల్ల ప్రభుత్వానికి ఏడాది 135 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. విద్యుత్ ఛార్జీలు కూడా రెండు రూపాయలు తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. హెచ్‌టీకి ఆరు రూపాయల ముప్పై పైసలు, ఎల్టీకి ఆరు రూపాయల డబ్బై పైసలు ఉన్న ఛార్జీలను రెండు రూపాయలు కట్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

నాగార్జున సాగర్‌ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య వివాదం!

పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్‌లో మరోసారి తెలుగు రాష్ట్రాల పోలీసుల వివాదం. సాగర్ డ్యాం పై ఏపీ సివిల్ పోలీసులు, టీఎస్ ఎస్‌పీఎఫ్‌ పోలీసుల మధ్య వాగ్వాదం. డ్యాంపైకి ఏపికి చెందిన ఎస్ఐ వాహనాన్ని అనుమతించని టీఎస్ సిబ్బంది. ఏపి పరిధిలోకి వెళ్లిన తెలంగాణ ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది వాహనాలకు చలానా విధించిన ఏపి పోలీసులు. ఇరువురి పంతాలతో ముదిరిన వివాదం. ఉన్నతాధికారుల వద్దకు చేరిన పోలీసుల పంచాయితీ. విషయం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు రాజీ కుదురుస్తున్నట్టు తెలుస్తోంది. 

పోలీసుల నోటీస్‌పై కోర్టుకెళ్లిన బండి సంజయ్- పాదయాత్రకు అనుమతివ్వాలని కోర్టులో పిటిషన్

పాదయాత్ర ఆపేయాలన్న జనగామ పోలీసుల నోటీసులపై బీజేపీ న్యాయపోరాటం చేస్తోంది. కోర్టులోనే తేల్చోవాలని నిర్ణయించి తెలంగాణ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ వేసింది. దీన్నిపై స్పందించిన హైకోర్టు రిగ్యులర్ పిటిషన్ వేయమని సూచించింది. దీనిపై కోర్టు 3.45 గంటలకు వాదనలు విననుంది.

తెలంగాణవ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలు - తన నివాసంలో బండి సంజయ్ ఆందోళన

బీజేపీ నేతలను అక్రమంగా అరెస్టులు, పాదయాత్రను ఆపేయాలని చెప్పడంపై ఆ పార్టీ భగ్గుమంటోంది. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తన నివాసంలోనే నిరసన దీక్ష చేపట్టారు. 

Background

Breaking News Live Telugu Updates: 


తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలు చేపట్టింది. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలకు వ్యతిరేకంగా ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ దీక్షా కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగానే  గృహ నిర్భంధంలో ఉన్న బండి సంజయ్ కుమార్.. కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ లో ఉన్న తన నివాసంలో ‘‘నిరసన దీక్ష’’ చేయనున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే నిరసన దీక్షలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకే.. దిగ్విజయంగా కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ ను అక్రమంగా నిర్బంధించారని చెబుతున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగిస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి విశేష ఆదరణ వస్తుండటం, బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలు సక్సెస్ కావడంతో ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని బీజేపీ నేతలు చెబుతున్నారు. 






బీజేపీ నిరసన దీక్ష..


జిల్లా హెడ్ క్వార్టర్స్, మండల కేంద్రాలు, హైదరాబాద్‌లో ఈ నిరసన దీక్షలు చేయనున్నారు. కరీంనగర్ జోత్యి నగర్‌లోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్న బండి సంజయ్ అక్కడే నిరసన దీక్ష చేయనున్నారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగే నిరసన దీక్షలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.


నిరంకుశ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు..









బండి సంజయ్ గృహ నిర్బంధం..


ప్రజాసంగ్రామ యాత్ర చేస్తూ జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ మండలం పామునూరు వద్ద ధర్మ దీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కరీంనగర్ లోని ఆయన ఇంటికి తరలించారు. బండి సంజయ్ గృహ నిర్బంధాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ఇన్ఛార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. 


అందుకే గృహ నిర్బంధం..


హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఇది అక్రమమంటూ బండి సంజయ్ తన పాదయాత్ర ప్రారంభించే ముందు నల్ల బ్యాడ్జీ ధరించారు. అనంతరం ధర్మ దీక్షకు కూర్చున్నారు. కవిత ఇంటి ముందు బీజేపీ శ్రేణులు నిరసన తెలపడాన్ని వ్యతిరేకిస్తూ.. టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో బండి సంజయ్ పాదయాత్ర వద్దకు వస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సుమారు 300 మంది పోలీసుల బలగాలను మోహరించి బండి సంజయ్ దీక్షను భగ్నం చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కరీంనగర్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.