AP DGPs Disc Awards: ఏపీలో శాంతిభద్రతల విభాగం లో 2022లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ డిస్క్ అవార్డులను ఇటీవల అందించారు. కానిస్టేబుల్ నుంచి అడిషనల్ డీజీ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల విభాగంతో పాటు కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్, దిశ విభాగాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి మొత్తం 77 మంది డీజీపీ డిస్క్ అవార్డులను అందజేశారు. వీటిలో బంగారం, వెండి, ఇత్తడి మెడల్స్ ను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (AP DGP Rajendranath Reddy) మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో (AP Police Medals) అందించారు. 15 మంది ఎస్పీలు గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. 56 మంది కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ స్థాయి అధికారులకు సిల్వర్ మెడల్స్, మరో ఐదుగురు డీఎస్పీలు, ఏఎస్ఐలు కాంస్య పతకాలు అందుకున్నారు.







సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్..
అయితే కొందరు పోలీసులకు డీజీపీ అందించిన డిస్క్ మెడల్స్ పై ఇలా ప్రచారం చేస్తున్నారు. 26 జిల్లాల్లో కేవలం 5 జిల్లాల ఎస్పీలు మాత్రమే "బెస్ట్ పెర్ఫార్మర్స్"గా గుర్తింపు పొందిన ఒక సామాజిక వర్గం అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మా కులపోడే పర్లేదు అంటూ ఓ వీడియోను షేర్ చేయగా వైరల్ అవుతోంది. అమ్మిరెడ్డి, రిశాంత్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి, మాధవ్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి అనే పోలీసుల ఫొటోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు.  






ఒకే సామాజికవర్గానికి చెందిన ఎస్పీలకు బెస్ట్ పెర్మార్మెన్స్ గుర్తింపు లభించదన్న సోషల్ మీడియా పోస్టుపై ఏపీ పోలీసు శాఖ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. పైన కనిపించే పోస్ట్ లో ఫేక్ న్యూస్ అని, ఈ ఫేక్ న్యూస్ ని పోస్ట్ చేసిన వారితో పాటు షేర్ చేయడం, ప్రమోట్ చేసిన వారిపై సైతం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
వాస్తవం ఏంటంటే: 21 జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లతో సహా మొత్తం 77 మంది పోలీసు సిబ్బందికి అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు DGP డిస్క్ అవార్డులు అందజేశారు అని ఏపీ పోలీస్ శాఖ తెలిపింది. ఏ పోలీస్ కు ఏ అవార్డ్ అందించారో జాబితాను సైతం పోలీస్ శాఖ పోస్ట్ చేసింది. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది.