AP News: మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేసశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ సోదాలు చేపట్టింది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలోననూ సీఐడీ సోదాలు జరుగుతున్నాయి. కాగా చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి ఖాతాదారుల సొమ్ము మళ్లింపు, నిబంధనల ఉల్లంఘనలపై ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు శనివారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ మార్గదర్శి మెయిన్ బ్రాంచ్ లో మేనేజర్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అలాగే గతంలోనూ సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే నిధుల మళ్లింపుపై సీఐడీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే సీఐడీకి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. 


గతేడాది నవంబర్ లో సోదాలు - అడిగిన వివరాలు ఇవ్వడం లేదని వెల్లడి


మార్గదర్శి  చిట్ ఫండ్స్‌లో అనేక రకాల అవకతవకలు గుర్తించామని.. ఆంధ్రప్రదేశ్  స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఐజీ రామకృష్ణ నవంబర్‌లో ప్రకటించారు. మార్గదర్శిలో డబ్బుకి భద్రత ఉందా లేదా అనే సందేహం ఉందన్నారు.  రాష్ట్ర విభజన తర్వాత స్టాట్యూటరీ డాక్యుమెంట్లు ఫైల్‌ చేయలేదన్నారు. అందుకే  మార్గదర్శి ఆర్థికస్థితిపై అనుమానాలున్నాయన్నారు. ప్రతి చిట్‌ వివరాలు ఇస్తేనే వాస్తవం తెలుస్తుందని..కానీ పూర్తి వివరాలు ఇవ్వడం లేదని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఐజీ రామకృష్ణ తెలిపారు. ఒక చిట్‌కు సంబంధించిన డబ్బును ఇతర వ్యాపారులకు వాడకూడదన్నారు. 


చిట్‌ఫండ్‌ నగదును ఇతర వ్యాపారాలకు మళ్లించారన్న ఐజీ 


మార్గదర్శి చిట్ ఫండ్ కు చెందిన నగదును.. ఉషోదయ, ఉషాకిరణ్‌ సంస్థల్లో పెట్టినట్టు ఆధారాలు గుర్తించామని రామకృష్ణ తెలిపారు.  మార్గదర్శి ప్రజలను చీట్‌ చేసినట్టుగానే పరిగణించాలన్నారు.  సమాచారం కోసం అడిగితే సహకరించడం లేదు సహకరించకపోగా మేం దుర్భాషలాడామని ఆరోపిస్తున్నారని విమర్శించారు. చాలా రకాలుగా అక్రమాలు పాల్పడినందున చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. షోకాజ్‌ నోటీసులు ఇస్తామని ప్రకటించారు.  మార్గదర్శి అకౌంట్ల నిర్వహణ సక్రమంగా లేనందున స్పెషల్‌ ఆడిట్‌ చేయాలని ఆదేశించామన్నారు.  ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశాలు ఇస్తామని తెలిపారు.


హైదరాబాద్‌లోనూ తనిఖీలు చేస్తామన్న ఐజీ 


తెలంగాణ అధికారుల సహకారంతో హైదరాబాద్‌ సంస్థలో తనిఖీలు చేస్తామని రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వానికి ఏ సంస్థపైనా వివక్ష ఉండదన్నారు.  2018లో కపిల్‌చిట్‌ఫండ్స్‌పై చర్యలు తీసుకున్నామన్నారు. 2022 వరకు కపిల్‌ చిట్‌ఫండ్స్‌కు కొత్త చిట్‌కు అనుమతి ఇవ్వలేదన్నారు. 2018లో కూడా మార్గదర్శి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని ఐజీ చెప్పారు. ఆ రోజే సెకండ్‌ అకౌంట్‌ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. కానీ మార్గదర్శి సెకండ్‌ అకౌండ్‌ వివరాలు ఇవ్వలేదన్నారు. అప్పట్లోనే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో చిట్ ఫండ్ కంపెనీల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. చిట్స్ పేరుతో సేకరిస్తున్న సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించుకుంటున్నారని.. దానితో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఈ విషయంపై కంపెనీ సిబ్బంది ఇళ్లలో సోదాలు చేయడం కలకలం రేగుతోంది.