Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్య కేసు (Murder Case) మలుపులు తిరుగుతూనే ఉంది. రోజు ట్విస్టు వెలుగులోకి వస్తోంది. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ (Cbi Sp)  రామ్ సింగ్, కూతురు డాక్టర్ సునీతారెడ్డి (Sunitha Reddy), అల్లుడు రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy)పై పులివెందుల పోలీసులు కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ నెల 15న వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో ముగ్గురిపై వివిధ సెక్షన్ల కేసు పెట్టారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌, సునీత, రాజశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో ఈ ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. పులివెందుల కోర్టు ఆదేశాలతో  ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పూర్తి స్థాయి విచారణ జరిపిన పులివెందుల పోలీసులు.. సిట్‌ దాఖలు చేసిన రెండు నివేదికల ఆధారంగా దాదాపు 27మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు. 


హైదరాబాద్ లో వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లినపుడు, ఆయన కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి బెదిరించారని 2021లోనే కోర్టుకు ఫిర్యాదు చేశారు పీఏ కృష్ణారెడ్డి. వైసీపీకి చెందిన కొందరి పేర్లు చెప్పాలని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ తనను ఒత్తిడి చేశారంటూ పులివెందుల కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. కేసు విచారిస్తున్న రామ్ సింగ్ విచారణ పేరుతో వేధింపులకు గురి చేశారని, సాక్షిగా ఉండాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు. తన కుమారుల ఎదుటే సీబీఐ క్యాంపు కార్యాలయంలో తీవ్రంగా హింసించారని వెల్లడించారు. రెండేళ్లపాటు విచారించిన పులివెందుల కోర్టు...ఈ నెల 8న తీర్పు ఇచ్చింది. తుది నివేదికను జనవరి 4వ తేదీలోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 


తన భర్త అప్రూవర్‌గా మారిన తర్వాత ఇబ్బందులు ఎక్కువ అయ్యాయని దస్తగిరి భార్య షబానా తెలిపారు. వివేకా కేసులో రాజీకి రావాలని వైసీపీ పెద్దలు చెప్పారని, వారి ప్రయత్నాలు కుదరకే తన భర్తను ఇబ్బంది పెడుతున్నారని షబానా ఆరోపించారు. తమ కుటుంబానికి ఏం జరిగినా వైసీపీ నేతలు, ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.  తన భర్తకు బెయిల్ రాకుండా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వివేకా కేసులో రాజీకి రావాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎర్రగుంట్ల పోలీసులు నమోదు చేసిన అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన దస్తగిరి 50 రోజులుగా కడప జైల్లో ఉన్నారు. తన భర్త బెయిల్ పై బయటకు రాకుండా అనేక తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. వాళ్లు ఎన్ని కుట్రలు పన్నిన వెనక్కి తగ్గడం లేదనే ఉద్దేశంతోనే జైలులో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిపోయాడు. తమ బంధువుల అమ్మాయిని కారులో తీసుకెళ్లారని ఆరోపిస్తూ, కడప జిల్లా యర్రగుంట్ల పోలీసులు స్టేషన్​లో కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దస్తగిరిపై కిడ్నాప్, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అక్టోబరు 31న దస్తగిరిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.