విశాఖపట్నం: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) మరోసారి మానవత్వం చాటుకున్నారు. కొద్ది రోజుల కిందట సాలపువానిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులను మంత్రి గుడివాడ అమర్నాథ్ హుటాహుటిన తన వాహనంలో ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడటం తెలిసిందే. కాగా శనివారం వడ్లపూడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మంత్రి అమర్నాథ్ అక్కడికి సమీపంలో ఉన్న పీహెచ్సీకి తన వాహనంలోనే తరలించి సహాయం చేశారు. 


ఫార్మాసిటీలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలనకు మంత్రి అమర్నాథ్ వెళ్లారు. ఫార్మాసిటీ నుంచి తిరిగి మింది వస్తున్న సమయంలో వడ్లపూడి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి దీన స్థితిలో ఉన్న ఇద్దరు క్షతగాత్రులు కనిపించారు. ఇది చూసిన మంత్రి అమర్నాథ్ వారిని తన వాహనంలో ఎక్కించి, తన సిబ్బందిని వారి వెంట తోడుగా పంపి అక్కడికి సమీపంలో ఉన్న పీహెచ్సీ లో చేర్పించారు. ఈ క్షతగాత్రులలో ఒకరు ఐ.కృష్ణంరాజుగా గుర్తించారు. ఇతనితో పాటు మరొక వ్యక్తికి కూడా ఇదే ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు.