Ambati Rambabu Comments on Pawan Kalyan: తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఉమ్మడిగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో పెట్టిన బహిరంగ సభ ఉత్తిదే అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బస్సులు, ట్రైన్‌లలో రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని సమీకరించే కార్యక్రమం చేశారని అన్నారు. చాలా ఆర్భాటం చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఆరు లక్షల మందికి పైగా జనం హాజరవుతారంటూ ముందుగానే ప్రచారం చేసుకున్నారని.. తీరా అక్కడకొచ్చిన జనాన్ని చూస్తే కార్యక్రమం కాస్త తుస్సుమన్నదని ఎద్దేవా చేశారు.


సత్తెనపల్లి క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఈరోజు కొత్తగా కలవడమేంటి..? గతంలో 2014 ఎన్నికల్లో ఇద్దరూ కలిసే పోటీచేశారు. చంద్రబాబు మీరు కలిసిన తర్వాతనే అధికారంలోకొచ్చాడు. చంద్రబాబుతోనే జనసేన పవన్‌కళ్యాణ్‌ అంటకాగాడు. చంద్రబాబు చేతనే పరిపాలన చేయించాడు. మరి, ఐదేళ్లు ఇద్దరూ కలిసి అధికారం వెలగబెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయగలిగారు..? అని ప్రశ్నిస్తున్నాను. ప్రజల మదిలో గుర్తుండిపోయే ఒక్క మంచి పనిని మేము చేశామని చెప్పే దమ్ముందా..? అని వారిద్దర్నీ అడుగుతున్నాను. ఐదేళ్లపాటు మీ ఇద్దరి ఉమ్మడి అధికారంలో అడ్డగోలుగా పరిపాలించారన్నది వాస్తవం. జనసేన మద్ధతుతో అధికారంలోకొచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అత్యంత దౌర్భాగ్యమైన పరిపాలన చేసింది. మరి, దీనికి పవన్‌కళ్యాణ్‌ బాధ్యుడు కాడా..?


టీడీపీతో పొత్తుకు బీజేపీ ఆశీస్సులు అనడానికి సిగ్గు అనిపించలేదా?
జనసేన ఆల్రెడీ బీజేపీ పొత్తులో ఉందని పవన్‌కళ్యాణ్‌ గుర్తుచేస్తూ.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నామని.. మా ఇద్దరి పొత్తుకు బీజేపీ ఆశీస్సులుండాలని చెప్పాడు. దీన్నిబట్టి ఇతని పొలిటికల్‌ లాజిక్కేంటో ఎవరికీ అర్ధంకావట్లేదు. ఒకరితో పొత్తులో ఉండి మరొకరితో రహస్యంగా సంసారం చేయడం రాజకీయంగా కాకున్నా నిత్య జీవితంలో నీకెటూ అలవాటే కదా పవన్‌..? అదే పద్ధతిలో బీజేపీతో బంధం పెట్టుకుని తెలుగుదేశం పార్టీతో ఉన్న విడిపోని బంధాన్ని ఆశీర్వదించమని కోరుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వ్యక్తి పవన్‌కళ్యాణ్‌.


జనసేన పుట్టింది లోకేశ్‌ బలోపేతానికా..
ఎప్పుడైతే చంద్రబాబునాయుడును అరెస్టు చేశారో.. వెంటనే లోకేశ్‌బాబును నాయకుడ్ని చేయాలని మేం ప్రయత్నిస్తున్నాం.. అంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నాడు. ఛీ.. మీ బతుకు చెడా.. మీ జనసేన పార్టీ పుట్టింది లోకేశ్‌బాబును బలోపేతం చేయడానికా..? అని నేనడుగుతున్నాను. మీరు పార్టీ పెట్టింది మీరు రాజకీయంగా బలోపేతం కావడానికా..? తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికా..? మీది రాజకీయ పార్టీయేనా..? నిజంగా మీది రాజకీయ పార్టీనే అయితే, మరో రాజకీయ పార్టీలో అసమర్ధుడిగా తిరస్కరించబడిన లోకేశ్‌ను బలోపేతం చేస్తామంటే.. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా మౌనంగా కూర్చొన్నాడంటే... ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా..?


మీ ప్యాకేజీ డ్రామా అందరికీ తెలుసు
లోకేశ్‌ను రాజకీయంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సభకు మొదట్లో మేం రాకూడదనుకున్నాం. ఆ తర్వాత మరలా రావాలని నిర్ణయించుకుని వచ్చామని పవన్ కల్యాణ్ చెప్పారు. అంటే, మీరెందుకు రాకూడదని అనుకున్నారో.. మరలా ఎందుకు, ఎలా వచ్చారో.. అనేది ప్రజలకు తెలియదని మీరనుకున్నారా..? మీ ప్యాకేజీ డ్రామాలు ఎవరికీ తెలియదనుకుంటున్నారా..? చంద్రబాబు ఇంటికొచ్చి ప్యాకేజీ మొత్తం మాట్లాడుకున్న తర్వాతనే కదా.. లోకేశ్‌ ముగింపు సభకు పవన్‌కళ్యాణ్‌ బయల్దేరి వెళ్లింది..? ఇలా ఒక దౌర్భాగ్యపు రాజకీయాలు చేసే పరిస్థితికి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు తెరదీశారు’’ అని అంబటి రాంబాబు మాట్లాడారు.