విశాఖపట్నం:  ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో సహాయం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు క్షతగాత్రులకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సహాయం అందించి వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 
ఈ ఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన పినపోలు నాగేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సంజయ్ ద్విచక్ర వాహనంపై శుక్రవారం మధ్యాహ్నం విశాఖ వైపు వస్తున్నారు.   మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న అల్యూమినియం రైలింగ్ ని ఢీకొని కింద పడటంతో  వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నాగేశ్వరరావుకు తలతో సహా పలు చోట్ల గాయాలై తీవ్ర రక్తస్రావం అవుతోంది. అలాగే సుమారు 10 ఏళ్ల వయసు ఉన్న సంజయ్ కూడా తీవ్ర రక్తస్రావంతో రోడ్డు మీద పడి ఉన్నాడు. 
ఇదే సమయంలో మంత్రి అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గంలో కార్యక్రమాలు ముగించుకుని విశాఖపట్నం వస్తున్న సమయంలో రోడ్డు పక్కన రక్తమోడుతూ కనిపించిన వీరిద్దరిని చూశారు. వాహనం దిగి వెంటనే తన కాన్వాయ్ లో ఉన్న ఒక వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి, పోలీసుల సహాయంతో వారిని లంకెలపాలెం సిహెచ్సికి తరలించారు మంత్రి అమర్నాథ్. 


అక్కడ ప్రాథమిక చికిత్స జరుగుతున్న సమయంలోనే మరో రెండు అంబులెన్స్ లను కూడా ఆసుపత్రికి పంపించి క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విశాఖ పంపించాలని వైద్యాధికారులను మంత్రి అమర్నాథ్ ఆదేశించారు. తీవ్ర గాయాలైన నాగేశ్వరరావు,  సంజయ్ ప్రస్తుతం విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి అమర్నాథ్ ప్రమాద స్థలికి చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించకపోయి ఉంటే వారి పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉండేది.