AP Local Body Elections | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) తుది ఓటర్ల జాబితాలతో కాకుండా పాత ఓటర్ల జాబితా ఆధారంగానే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) నిర్ణయించింది. 2025 నాటి సర్ ఓటర్ల జాబితాల ఆధారంగానే పోలింగ్ జరగనుంది.

Continues below advertisement

అక్టోబరు 3న SIR తుది ఓటర్ల జాబితాలు ప్రచురితం చేయనున్నారు. వాటిని ప్రామాణికంగా తీసుకుని స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని భావిస్తే స్థానిక ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతుందని భావించి 2025 నాటి ఓటర్ల జాబితాలకే రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఈ మేరకు పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఫొటో గుర్తింపు ఓటర్ల జాబితాల ప్రచురణకు ఈసీ ఆదేశాలతో ఏర్పాట్లు వేగవంతంగా సాగుతున్నాయి. స్థానిక సంస్థలకు అక్టోబరులోనే ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఏపీ ప్రభుత్వం ఉందని గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తోంది.  

రిజర్వేషన్లపై త్వరలో కీలక నిర్ణయం

Continues below advertisement

బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ శుక్రవారమే తన నివేదికను సమర్పించింది. దీనిపై కూటమి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికలు మరింత దగ్గరపడినట్లే అని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్ల జాబితాల ప్రచురణను మున్సిపాల్టీల్లో సెప్టెంబర్ 3 నాటికి, ఇప్పటివరకు జాబితా సిద్ధం చేయని సుమారు 50 పంచాయతీల్లో ఆగస్టు 17 లోగా పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ఎంపిక, వాటి పబ్లికేషన్ ప్రక్రియను ఆగస్టు 21 నుంచి 31 లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనపు బ్యాలెట్ బాక్సుల కోసం ఇతర రాష్ట్రాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పటికే లేఖలు రాశారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఇతరత్రా ముందస్తు ఏర్పాట్లను 30 నుండి 45 రోజుల్లోగా పూర్తి చేయాలనే ప్రణాళికతో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. 

ఓటర్ల జాబితా కోసం నోటిఫికేషన్ జారీ

 ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నెం.401/SEC-F1/2026-1 జారీ చేసింది. దాంతో మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వార్డుల వారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాల ప్రచురణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారత ఎన్నికల సంఘం సేకరించిన తాజా అసెంబ్లీ ఓటర్ల డేటాను ప్రాతిపదికగా తీసుకుని మున్సిపల్ వార్డుల వారీగా విభజిస్తున్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు మున్సిపల్ కమిషనర్లు, పోలింగ్ స్టేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలో పాలనా సౌలభ్యం, ఫిర్యాదుల త్వరిత పరిష్కారం కోసం జోనల్ కమిషనర్లకు ప్రత్యేకాధికారాలు ఇచ్చారు.

ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు, సవరణలు, జాబితాల్లో పేర్లను సరిచూసుకోవడానికి CEO Andhra Pradesh Portal ద్వారా సమాచారం పొందవచ్చు. స్థానిక ఎన్నికల నిర్వహణ విధానం, ముందస్తు సమాచారం, అప్‌డేట్స్ తెలుసుకోవడానికి Election Commission of India వెబ్‌సైట్‌ను చూడాలని అధికారులు సూచించారు.