AP Anganwadi News: ఏపీలో అంగన్ వాడీలు చేస్తున్న సమ్మె విరమించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇటీవల సోమవారం (జనవరి 22) ఉదయం 9.30 వరకూ గడువు విధించిన ప్రభుత్వం.. ఆ లోపు విధుల్లో చేరకపోతే వారిని తొలగిస్తామని తేల్చి చెప్పింది. దీంతో భయపడి కొంత మంది అంగన్ వాడీ వర్కర్లు విధుల్లో చేశారు. కానీ, చాలా మందిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత 42 రోజులుగా సమ్మె చేస్తోన్న అంగన్ వాడీలు, హెల్పర్లపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
సోమవారం ఉదయం 9.30 గంటలలోపు విధుల్లో చేరని వారిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించింది. ఈ మేరకు గుంటూరు జిల్లాలో విధులకు హాజరుకాని 1,734 మంది, పల్నాడు జిల్లాలో 1,358 మందిని తొలగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు టెర్మినేషన్ ఆర్డర్లను జారీ చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 1,299 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 1,253 మంది హెల్పర్లు తిరిగి విధుల్లో చేరినట్లు కలెక్టర్ తెలిపారు.
చంద్రబాబు స్పందన
‘‘జగన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై రోడ్డెక్కిన అంగన్వాడీల పై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగడం దారుణం. వైసీపీ ప్రభుత్వం తన సహజసిద్ధమైన వేధింపులు, కక్ష సాధింపు పద్దతులను అంగన్వాడీలపైనా ప్రయోగించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం. నిరసనలను అణచివేయడం, అనైతిక పద్దతిలో సమ్మెను విచ్ఛిన్నం చేయడం కంటే, ఆ సమయాన్ని సమస్య పరిష్కారంపై పెడితే ఇప్పటికే ఫలితం వచ్చి ఉండేది. అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం చర్యలకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి తన అహాన్ని పక్కన పెట్టి అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని చంద్రబాబు పోస్ట్ చేశారు.