AP Govt Employees: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పలుమార్లు ఉద్యమ బాట పట్టినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్ అయ్యారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, డీఏ చెల్లింపులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. విజయ్ కుమార్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, నరసాపురం తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష చేశారు. సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సంఘ సభ్యులతో కలిసి విజయ్ కుమార్ నినాదాలు చేశారు.


కలెక్టరేట్ల ఎదుట ప్రభుత్వ ఉద్యోగుల నిరాహార దీక్షలు 
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నామని గుంటూరు జిల్లా ప్రభుత్వం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చాంద్ భాషా అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన నాలుగు హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. తమ సమస్యలను తీర్చే వరకూ రిలే నిరాహార దీక్షలు ఆపేది లేదని చెప్పారు. అలాగే ఉమ్మడి విజయ నగరం జిల్లా శాఖలు ఆయా జిల్లా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఒప్పంద, ఔట్ సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ, పెనన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 


సమస్యలు పరిష్కరించాలని, హామీ అమలు చేయాలని డిమాండ్ 
దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు, చేసుకున్న ఒప్పందాలు అమలు చేయమని, ఒకటో తేదీన జీతాలు ఇచ్చేటట్లు చట్టం చేయాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సీపీఎస్ రద్దు చేయాలని, డీఏ బకాయిలు విడుదల చేయాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి నివేదించినా సరైన స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టామన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. 


ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ మహాసభలు 
ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ 27వ మహాసభలు ఈనెల 24న విజయవాడలో నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయిలో 9 వేల మంది మహాసభకు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మహాసభలకు రవాణా శాఖా మంత్రి, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ హాజరు అవుతారని, ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీ ఎన్నికలు కూడా ఈ మహాసభలో జరుగుతాయని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధి వలిశెట్టి దామోదర్ తెలిపారు. మూడో ప్రాంతీయ సదస్సు ఏలూరులో ఈ నెల 27వ తేదీన జరుగుతుందని చెప్పారు. ఉద్యమించకుంటే ప్రతి ఉద్యోగి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.