అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యరులు, వైయస్సార్‌సీపీ మద్దతు ఇస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని, సమన్వయంతో వారిని గెలిపించాలని సీఎం జగన్ సూచించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎస్. సుధాకర్, తూర్పు రాయలసీమ జిల్లాల అభ్యర్ధిగా పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ జిల్లాల అభ్యర్ధిగా వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి పేరును ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానానికి ఎం.వి. రామచంద్రారెడ్డి పోటీ చేస్తారని వెల్లడించారు.
(ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎడమ నుంచి కుడికి) పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎం.వి. రామచంద్రారెడ్డి , తూర్పు రాయలసీమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్ధి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్ధి వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎస్. సుధాకర్.
ఈ ఏడాది ఖాళీ కానున్న 23 ఎమ్మెల్సీ స్థానాలు
2019 ఎన్నికల్లో 175 అసెంబ్లిd స్థానాలకు గాను 151 సీట్లు సాధించిన వైసీపీ శాసన సభలో తిరుగులేని ఆధిక్యతను సొంతం చేసుకుంది. శాసన మండలిలో మెజార్టీ లేకపోవడంతో సీఎం జగన్‌కు తలనొప్పిగా మారింది. ఒకదశలో శాసన మండలిని రద్దు చేయాలనే ప్రతిపాదన చేశారు. తీర్మానం పంపారు. అయితే కేంద్రం ఆమోదించలేదు. కానీ తర్వాత జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పలువురు టీడీపీ సభ్యుల పదవికాలం పూర్తవ్వడంతో వైసీపీ బలం పెరిగిం ది. మండలిలో ఇప్పుడు మెజార్టీ కూడా వైసీపీదే. తాజాగా 23 స్థానాలు భర్తీ కావాల్సి ఉండటం తో శాసన మండలిలోనూ పూర్తిగా వైసీపీ ఆధిక్యత చూపించనుంది. శాసన మండలి లో టీడీపీ ప్రాతినిధ్యం పరిమితం కానుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, తెలంగాణలో 1 నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ వెలువడనుండగా, నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 23 గా ఉంది. మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ ఉండనుంది.
స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఏపీ నుంచి అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు, తెలంగాణ నుంచి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఉన్నాయి.
పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్సీలు వీరే
1. యండపల్లి శ్రీనివాసులు రెడ్డి (ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం)
2. గోపాల్ రెడ్డి వెన్నపూస (కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గం)
3. పీవీఎన్ మాధవ్ (శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం)
4. వి. బాలసుబ్రహ్మణ్యం (ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయుల నియోజకవర్గం)
5. కత్తి నరసింహా రెడ్డి (కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయుల నియోజకవర్గం)
6. కాటేపల్లి జనార్థన్ రెడ్డి (మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గం)