AP News: ఏపీ రైతులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతిని పురస్కరించుకొని నేడు ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఈరోజు కేవలం వైఎస్సార్ జన్మదినం మాత్రమే కాదు... వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు కూడా ఇదే. అందుకో ఈరోజు రైతు దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. ఈక్రమంలోనే ఈ సంవత్సరం కడప జిల్లా పర్యటనకు ముందు సీఎం జగన్ అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో పర్యటించనున్నారు. అక్కడ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయబోతున్నారు. సీఎం జగన్ పర్యటనకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా మంత్రి ఉషా శ్రీ చరణ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. 


సీఎం జగన్ నేటి షెడ్యూల్ ఇలా..!


ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కల్యాణదుర్గం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా వైఎస్సార్ ఘాట్ కు చేరుకొని తండ్రి వైస్స్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం ఇడుపుల పాయలోని ప్రార్థనా మందిరానికి వెళ్తారు. అక్కడ సింహాద్రిపురం మండల నాయకులతో సమావేశం అవుతారు. సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుంచి ఇడుపులపాయలోని ఇంటికి వెళ్లనున్నారు. పదో తేదీ వరకు సీఎం జగన్ కడప జిల్లాలోనే పర్యటించనున్నారు. 


ఆదివారం పర్యటన వివరాలు..


వైఎస్ఆర్ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండిపేట చేరుకుంటారు. గండిపేట వద్ద ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు సీఎం శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత సీఎం జగన్ పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్‌ ఆఫీసు భవనాన్ని ప్రారంభించనున్నారు.


మున్సిపల్ ఆఫీసు ప్రారంభం అనంతరం పులివెందుల, రాణితోపు చేరుకుని నగరవనాన్ని జగన్ ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి గరండాల రివర్‌ ఫ్రెంట్‌ చేరుకుని కెనాల్‌ డెవలప్‌మెంట్‌ ఫేజ్‌ –1 పనులను  ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. అనంతరం పులివెందులలోని నూతనంగా నిర్మించిన (వైఎస్సార్‌ ఐఎస్‌టిఏ) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు.  పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేసిన న్యూ టెక్‌ బయో సైన్సెస్‌ను సీఎం జగన్ ప్రారంభించున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు.


జులై 10న సీఎం జగన్ షెడ్యూల్..


సోమవారం మూడోరోజూ సైతం జగన్ వైఎస్సార్‌ జిల్లాలోనే పర్యటించనున్నారు. జులై 10న ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి జగన్ కడప చేరుకోనున్నారు. కడప పట్టణంలోని రాజీవ్‌ మార్గ్, రాజీవ్‌ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులనూ ప్రారంభించనున్నారు. అనంతరం కడప నుంచి కొప్పర్తికి జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్‌ యూనిట్‌ను ప్రారంభించనున్నారు. అక్కడ పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.