CM Jagan Released Jagananna Vidya Deevena Funds: రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందేలా అడుగులు వేశామని సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. ప.గో జిల్లా భీమవరం (Bhimavaram) జగనన్న విద్యా దీవెన (Jagananna Vidya Deevena), వసతి దీవెన (Vasathi Deevena) నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2023 - 24 జులై - సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధులను బటన్ నొక్కి పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 8.09 లక్షల మంది విద్యార్థులకు రూ.584 కోట్ల ఆర్థిక సాయం అందించామని చెప్పారు. ఇప్పటివరకూ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా రూ.11,900 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.4,275 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. విద్యా రంగంలో 55 నెలల్లోనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం 'జగనన్నకు చెబుదాం - 1902' నెంబర్ ద్వారా ఫిర్యాదు చెయ్యొచ్చన్నారు. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతూ విద్య అభ్యసించేలా చర్యలు తీసుకున్నామన్నారు. శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండే 'బైజూస్' కంటెంట్ ను పేదలకు సైతం అందేలా మార్పులు తెచ్చినట్లు వివరించారు.
ప్రతీ ఏడాది విడుదల
ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా 3 నెలలకోసారి పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. ఫైనలియర్ విద్యార్థులకు ఏ మాత్రం ఇబ్బందీ లేకుండా దాదాపు 2 లక్షల మందికి చివరి ఇన్ స్టాల్మెంట్ గా చెల్లించాల్సిన ఫీజు సైతం ఇప్పటికే ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. పిల్లల ఉన్నత చదువుల కోసం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాల కోసం రూ.16,176 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. గతంలో రూ.12 వేల కోట్లు ఖర్చు కూడా చేయలేని పరిస్థితి ఉందని, ఈ రోజు రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితుల మధ్య తేడాని గమనించాలని అన్నారు.
విప్లవాత్మక మార్పులు
పేదరికం నుంచి బయట పడాలన్నా, దేశం భవిష్యత్ మార్చగలిగే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉందని, అందుకే విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని సీఎం జగన్ చెప్పారు. నాడు - నేడుతో ప్రభుత్వ బడులను అభివృద్ధి చేశామని, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈతో మొదలై ఐబీ సిలబస్ ప్రవేశ పెట్టడం వంటి వాటి ద్వారా విద్యా రంగం బలోపేతానికి కృషి చేశామన్నారు. 3వ తరగతి నుంచే టోఫెల్ ను సబ్జెక్ట్ గా తీసుకొచ్చామని గుర్తు చేశారు. 'ఉన్నత విద్యలో సంస్కరణలు తెచ్చాం. 10 నెలల ఇంటర్న్ షిప్, ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తున్నాం. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద 400 మంది పిల్లలు ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో చదువుతున్నారు. ఎంఐటీ, హార్వర్డ్, ఎల్ బీఎస్ వంటి సర్టిఫికెట్లు ఆ ప్రఖ్యాత యూనివర్శిటీల నుంచే వచ్చేలా హెడెక్స్ సంస్థతో టై అప్ అయ్యాం. ఏఐ అనుసంధానంతో ఆన్ లైన్ కోర్సులు తెస్తూ వీటిని డిగ్రీ కోర్సులో భాగం చేస్తున్నాం. ఈ ఫిబ్రవరి నుంచే ఆ దిశగా అడుగులు వేస్తున్నాం.' అని వివరించారు.
Also Read: YSRCP Leaders on Jagan: వంశీకృష్ణ, రాంబాబు తర్వాత పార్థసారథి-వైసీపీలో పెరుగుతున్న అసంతృప్త స్వరాలు