Chandrababu attends Anant Ambani wedding : దేశం మొత్తం ఇప్పుడు ముంబై వైపు చూస్తోంది. అపర కుబేరుడు అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి జరుగుతున్న వైనం, వైభోగంపై విస్తృతంగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రపంచంలోని ముఖ్యమైన సెలబ్రిటీలు పెళ్లికి హాజరవుతున్నారు. ఇక స్వదేశంలో ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. మూడు రోజుల పాటు జరగనున్నపెళ్లిలో రెండు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా కుటుంబసమేతంగా హాజరు కానున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంచ్‌ల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లే షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేశారు. పదమూడో తేదీన సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి ముంబై ఎయిర్ పోర్టులోని కాలినా టెర్మినల్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్తారు. అక్కడే అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహం జరుగుతుంది.
రాత్రి పదిన్నర వరకూ వివాహ వేడుకల్లో పాల్గొన్న తర్వాత నారిమన్ పాయింట్ లోని ఓబెరాయ్ హోటల్లో బస చేస్తారు. పధ్నాలుగో తేదీన ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మళ్లీ ముంబైలోని మఖేష్ అంబానీ నివాసం ఆంటీలియాలో జరగనున్న ఫంక్షన్ కు హాజరవుతారు. దాదాపుగా గంట సేపు వేడుకల్లో పాల్గొన్న తర్వాత ముంబై నుంచి విజయవాడకు తిరుగు పయనమవుతారు. ఆదివారం మధ్యాహ్నం రెండున్నరకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
వివాహ వేడుకలకు ప్రపంచ స్థాయి సెలబ్రిటీలు వస్తున్నారు దేశ, విదేశాల నుంచి దిగ్గజాలంతా పెళ్లికి హాజరవుతున్నారు. వారందరికీ తమ స్థాయికి తగ్గటుగానే అతిథి సత్కారాలు చేస్తోంది అంబానీ కుటుంబం. వారికి స్వాగతం పలికినప్పటి నుంచి వీడ్కోలు చెప్పే వరకు ఏ మాత్రం తగ్గడం లేదు. అతిథులకు ఖరీదైన రిటర్న్ గిఫ్టులు కూడా ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్‌లో వీవీఐపీ అతిథులకు కోట్ల విలువైన గడియారాలు ఇస్తున్నట్టు సమాచారం. ఇతర అతిథులకు కశ్మీర్, రాజ్ కోట్, బెనారస్‌ల నుంచి ఆర్డర్ చేసిన గిఫ్ట్‌లు ఇవ్వనున్నారు.
పెళ్లి కోసం ప్రైవేట్ జెట్స్, ట్రాఫిక్ ఆంక్షలు, ముంబాయ్ అంతా హడావిడి అంటూ నెటిజన్లు.. దీని గురించే మాట్లాడుకుంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ పెళ్లి కావడంతో వారి కంపెనీల్లోని ఉద్యోగులు అందరికీ స్పెషల్ గిఫ్ట్స్‌ను అందించారు. చాలామంది రిలయన్స్ ఉద్యోగులు.. అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా తమకు అందిన రిటర్న్ గిఫ్ట్స్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.