Kerala Assembly Elections AP BJP leaders: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరంలో భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచేలా తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు కేరళలో ఎన్నికల బాధ్యతలను అప్పగించింది.   ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి  ప్రస్తుతం కేరళలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కేరళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా ఆయన క్షేత్రస్థాయిలో చేస్తున్న పర్యటనలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Continues below advertisement

విష్ణువర్ధన్ రెడ్డి కేరళలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, వార్డు స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని కేరళ ప్రజలకు వివరించడమే కాకుండా, గత 40 ఏళ్లుగా అక్కడ సాగుతున్న కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల పాలనలోని వైఫల్యాలను ఎండగడుతున్నారు. కేరళలో అవినీతి, వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించాలంటే బీజేపీయే ఏకైక ప్రత్యామ్నాయమని ఆయన బలంగా వినిపిస్తున్నారు.

ఈ ఎన్నికలు కేరళ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపు అని విష్ణువర్ధన్ రెడ్డి అభివర్ణించారు. కమ్యూనిస్టుల కోటలో కాషాయ జెండా ఎగురవేయడానికి తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల నిర్వహణ అనుభవాన్ని ఆయన ఇక్కడ జోడిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన నిర్వహిస్తున్న రోడ్ షోలు, కార్యకర్తల సమావేశాలకు విశేష స్పందన లభిస్తోంది. నిజమైన మార్పు కేవలం బీజేపీతోనే సాధ్యం అన్న నినాదంతో ఆయన చేస్తున్న ప్రసంగాలు స్థానిక యువతను, పార్టీ కార్యకర్తలను ఆకట్టుకుంటున్నాయి.  

కేరళ మీడియాలో విష్ణువర్ధన్ రెడ్డి పర్యటనలకు ప్రాధాన్యత లభిస్తోంది. తెలుగు నేతలు కేరళ ఎన్నికల బరిలో యాక్టివ్‌గా ఉండటం వల్ల అటు ప్రవాస ఆంధ్రులతో పాటు, స్థానిక ఓటర్లను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. కార్యకర్తల అంకితభావం, ఉత్సాహం చూస్తుంటే ఈసారి కేరళ అసెంబ్లీలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా అవతరించడం ఖాయమని విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.