AIADMK leader controversial comments on Nayanthara: తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకున్న తరుణంలో అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి సి.వి. షణ్ముగం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మహిళల రక్షణ కోసం అన్నాడీఎంకే చేపట్టిన నిరసన ర్యాలీలోనే ఒక మహిళా నటిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ప్రజల సమస్యలు, ఆకాంక్షలను తెలుసుకునేందుకు  మీ కలను చెప్పండి అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకాన్ని ఎద్దేవా చేసే క్రమంలో అన్నాడీఎంకే ఎంపీ సి.వి. షణ్ముగం విల్లుపురంలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ మీ కలలు చెప్పండి నెరవేరుస్తాం అంటున్నారు.. ఒకవేళ నా కలలోకి నయనతార వచ్చి, నాకు ఆమె కావాలని అడిగితే స్టాలిన్ నా కలను నెరవేరుస్తారా? ఎవరైనా నయనతారతో పెళ్లి చేయమని అడిగితే ఆయన చేస్తారా?  అంటూ వెటకారం చేశారు.     

 మహిళలపై పెరుగుతున్న నేరాలు, శాంతిభద్రతల క్షీణతకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే స్వయంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలోనే ఆయన ఒక మహిళను కించపరిచేలా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళల భద్రత కోసం పోరాడుతున్నామని చెబుతూ, వేదికపై ఒక మహిళా నటి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫోటోలను జేబులో పెట్టుకుని తిరుగుతూ, మహిళల పట్ల ఇలాంటి నీచమైన మనస్తత్వం కలిగి ఉండటం సిగ్గుచేటని మహిళా సంఘాలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ వ్యాఖ్యలపై అధికార డీఎంకే కూటమి తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలను విమర్శించలేక, ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం షణ్ముగం అహంకారానికి పరాకాష్ట అని డీఎంకే నేతలు విమర్శించారు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, మాజీ మంత్రిగా ఉండి మహిళలను ఉచితంగా ఇచ్చే వస్తువుల తో పోల్చడం ఆయన మానసిక స్థితిని సూచిస్తోందని తమిళనాడు సాంఘిక సంక్షేమ మంత్రి గీతా జీవన్ మండిపడ్డారు. 

మహిళా రక్షణ కోసం చేసే ర్యాలీలో నయనతారను ఒక వస్తువులా మాట్లాడటం ఏ రకమైన సంస్కృతి?" అని జర్నలిస్టులు, పౌర సమాజం ప్రశ్నిస్తోంది. నయనతార వంటి స్టార్ హీరోయిన్‌ను రాజకీయాల్లోకి లాగి, ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన షణ్ముగం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.  ఈ వివాదం అన్నాడీఎంకేకు పెద్ద తలనొప్పిగా మారింది. మహిళా ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే తమిళనాడులో, ఒక సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.