MP Mithun Reddy Accident: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండగ వేళ బంధువుల ఇంటికి మంత్రి పెద్దిరెడ్డి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిల కుటుంబసభ్యులు అందరూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుండి వీరబల్లిలోని అత్తగారి ఇంటికి వెళ్తున్నారు. మార్గ మధ్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన ఓ కారు ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన కారును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆ కారు పల్టీలు కొట్టి పడిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి కారులో ఉన్నారు. మిథున్‌రెడ్డి కాన్వాయ్ వాహనంలో ఉన్న 8 మందికి, ఎంపీ పీఏ, భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ఎంపీ మిథున్ రెడ్డి కారులో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. పర్సనల్ సెక్రటరీ, భద్రతా సిబ్బంది ఉండగా ప్రమాదం లో వారికి గాయాలు అయ్యాయి. వారిని వెంటనే రాయచోటిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో కారులో ఉన్న వారికి కూడా గాయాలు అయ్యాయి. వారిని కూడా స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి ఏ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాన్వాయ్ లోని ఓ వాహనానికి ప్రమాదం జరిగిన తరువాత, మంత్రి కారులోనే వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని రోడ్డుపై పడిపోయిన కార్లను పక్కకు తొలగించారు. ప్రమాదానికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. ఎదురుగా వచ్చిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా, లేదంటే అతి వేగం వల్ల కారును నియంత్రించలేకపోయాడా, అసలు ప్రమాదానికి కారణం ఏంటనే విషయాన్ని పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు.