AP CM Jagan Palasa Tour: శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.  డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌‌ను ప్రారంభిస్తారు సీఎం జగన్‌. ఆ తర్వాత పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి  ప్రారంభోత్సవంలోనూ పాల్గొంటారు. అనంతరం పలాసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. 


ముందుగా కంచిలి మండలం మకరాపురం చేరుకుని... అక్కడి ప్రజలను కలుస్తారు. వారి సమస్యలపై వినతులు స్వీకరిస్తారు. అక్కడ నుంచి వైఎస్‌ఆర్‌ సుజలధార ప్రాజెక్టు  దగ్గరకు చేరుకుని.. పంప్‌హౌస్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తారు. ఆ తర్వాత పలాస వెళ్తారు సీఎం జగన్‌. అక్కడ ప్రజలను కలిసి వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరిస్తారు. 11గంటల 40  నిమిషాలకు పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రానికి ప్రారంభిస్తారు. ఆస్పత్రి ప్రాంగణంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ఇండ్రస్టియల్‌ కారిడార్‌కు కూడా శంకుస్థాపన చేస్తారు సీఎం జగన్‌. ఎచ్చెర్లలోని బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత పాత జాతీయ రహదారి మీదుగా పలాస రైల్వే క్రీడా మైదానానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలో స్టాల్స్‌ను పరిశీలించి బహిరంగ సభలో మాట్లాడతారు. 


ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌.. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఊపిరి పోస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మెరుగైన కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందనుంది. ఆ ఆస్పత్రిలో డయాలసిస్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణించారు. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్‌ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్‌  మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్‌ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్‌ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు ఉన్నాయి. అంతేకాదు... సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్‌ కలర్‌ డాప్లర్, మొబైల్‌  ఎక్స్‌రే, థూలియం లేజర్‌ యూరో డైనమిక్‌ మెషీన్‌ వంటి పరికరాలతోపాటు ఐసీయూ సౌకర్యాలు కూడా ఉన్నాయి. జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ  వంటి స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్‌ పోస్టులు, 60 స్టాఫ్‌ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ చేయనున్నారు.


వైఎస్‌ఆర్‌ సుజలధార ప్రాజెక్టును కూడా రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఉద్దానం ప్రాంతంలో క్రానిక్‌ కిడ్నీ డిసీజెస్ ఎక్కువగా ఉన్న ఏడు మండలాల్లో వైఎస్‌ఆర్‌  సుజలధార ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు అందించనున్నారు. హిరమండలం రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకొచ్చి శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం  నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయబోతున్నారు. అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు  పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్ ఉపయోగపడుతుంది.