Breaking News Live Telugu Updates: స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా 

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 17 Oct 2023 11:35 AM
స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా 

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. ఏసీబీ కోర్టులో పెట్టుకున్న పిటిషన్ తిరస్కరించడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణ 19కి వాయిదా వేసింది. 

తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలో బస్‌ బోల్తా- అనకాపల్లి జిల్లా వాసులకు గాయాలు  


అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కొత్త పోలవరం గ్రామానికి చెందిన యాత్రికు వెళ్తున్న బస్‌ ప్రమాదానికి గురైంది. తిరుపతి వెళ్తుండగా నాయుడుపేట సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రయాణ సమయంలో బస్‌లో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. 20 మందిలో 11 మంది చిన్నారులు ఉన్నారు. వారిలో ఏడాది పాపకు చేతులు విరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు గూడూరు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. 

Background

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్క్వాష్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో తీర్పు వెల్లడి కానుంది. అవినీతి నిరోధకచట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రతిపక్షనేతను అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 23న స్పెషల్ లీవ్ పిటీషన్ ను దాఖలు చేశారు. సరైన మార్గదర్శకాలు పాటించకుండా చంద్రబాబును అరెస్ట్ చేసిన కారణంగా ఆయనపై మోపిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ దాఖలైన పిటీషన్ పై మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందుకు రానుంది.


చంద్రబాబు తరపున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే టైమ్ కి రాష్ట్ర ప్రభుత్వ వాదనలను వినిపించటం ముకుల్ రోహత్గీ పూర్తి చేయలేదు. కనుక ఈ రోజు మధ్యాహ్నం వాదనలు ఆయనతోనే ప్రారంభం కానున్నాయి. తన వాదనలను పూర్తిచేయడానికి మరో అరగంట సమయం కావాలని గత విచారణ సమయంలోనే ఆయన ధర్మాసనానికి చెప్పుకున్నారు.


రోహత్గీ వాదనలు పూర్తయిన వెంటనే సాల్వే కౌంటర్‌ వాదనలు ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రానికల్లా ఇరు పక్షాల వాదనలు పూర్తి అవుతాయి.మరి ఆ తర్వాత ధర్మాసనం తీర్పు ఇస్తుందా..లేదా తీర్పు రిజర్వ్ చేసి మరో తేదీ చెబుతుందా..చూడాలి. హైకోర్టులో తాను దాఖలుచేసిన క్వాష్‌పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి గత నెల 22న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సెప్టెంబర్‌ 23వ తేదీ నుంచి వాయిదాలతో కొనసాగుతూ వస్తోంది.


చంద్రబాబు ఆరోగ్యంపై పిటిషన్ 


రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడలోని ఏసీబీ కోర్టును కుటుంబసభ్యులు ఆశ్రయించారు. చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ మేరకు కుటుంబసభ్యుల తరపున చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు నివేదిక ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. వైద్యులు రిపోర్ట్స్ ఇవ్వడానికి నిరాకరించారని చంద్రబాబు లాయర్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.


చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రిపోర్ట్స్ మెయిల్‌లో వచ్చాయని ఏసీబీ కోర్టు జడ్జి తెలిపారు. ఫిజికల్ కాపీ అందిన తర్వాత ఇస్తామని చంద్రబాబు లాయర్లకు జడ్జి చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు తమకు నివేదిక ఇవ్వలేదని, ఈ నెల 12న పరీక్షలు నిర్వహించిన తర్వాత జైలు అధికారులు కూడా తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని పిటిషన్‌లో పొందుపర్చారు. అధికారులు చెప్పిన అంశాలతోనే రిపోర్ట్ ఇస్తున్నారని కుటుంబసభ్యులు  పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు తెలిపింది.


అయితే చంద్రబాబు ఆరోగ్యంపై గత కొంతకాలంగా ఏపీలో వివాదం నడుస్తోంది. చంద్రబాబు బరువు తగ్గారని కుటుంబసభ్యులు చెప్పగా.. ఒక కేజీ బరువు పెరిగినట్లు జైలు అధికారులు  చెబుతున్నారు. చంద్రబాబు శరీరం రంగు మారిందని, చర్మంపై దద్దుర్లు, అలెర్జీ వచ్చినట్లు రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ కలకలం రేపింది. చంద్రబాబును చల్లని వాతావరణం ఉంచాలని వైద్యులు సూచించారు. అలాగే పలు రకాల మెడిసిన్స్ కూడా సిఫార్సు చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుకు జైల్లో ఏసీ కల్పించాలని ఏసీబీ కోర్టులో బాబు లాయర్లు పిటిషన్ వేశారు. దీంతో బాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


చంద్రబాబుకు ప్రమాదకర స్టెరాయిడ్స్ ఇస్తున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించగా.. తన భర్తను చంపేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీంతో చంద్రబాబుకు వైద్య పరీక్షలు, చికిత్స అందించేందుకు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిటెండెంట్ ప్రత్యేక వైద్యుల బృందాన్ని నియమించారు. ఈ బృందం జైలుకు చేరుకుని బాబును పరీక్షించింది. బాబు ఆరోగ్యం తీవ్రంగా ఉందని వైద్యులు రిపోర్ట్ ఇవ్వడంతో మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఈ మేరకు ప్రత్యేక వీవీఐపీ గదిని కూడా సిద్దం చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని జైలు అధికారులు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందంటూ ఆదివారం హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు. వైద్యులు ఎప్పటికప్పుడు బాబుకు టెస్ట్‌లు చేస్తున్నారని, మెడిసిన్స్ కూడా సిఫార్సు చేస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు ఏసీ కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.