Breaking News Live Telugu Updates: కేంద్ర మంత్రి అమిత్ షాతో పీవీ సింధు భేటీ
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు
తప్పుచేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటున్న చంద్రబాబు చేసిన అవినీతి మీద చర్చకు రమ్మనమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని లోకేష్ పిలవడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఒక్క స్కిల్ డెవలప్ సెంటర్ పెట్టారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి గుడివాడ అన్నారు. శనివారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ.డీ., ఐ.టీ, సిఐడి అధికారులు విచారణకు రమ్మనమని లోకేష్ ను పిలుస్తుంటే, దాని గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చర్చకు పిలిచిన లోకేష్ తన స్థాయి ఏంటో, అతని బతికేంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో లోకేష్ పాత్ర బయట పెట్టడానికే దర్యాప్తు సంస్థలు ఆయనను పిలుస్తున్నాయని అమర్నాథ్ అన్నారు. 371 కోట్ల రూపాయలు పందికొక్కుల్లా తినేసి, బలిసి, అడ్డంగా దొరికిపోయి.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బహిరంగ చర్చకు ఏ విధంగా పిలుస్తున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. పీవీ సింధుతో భేటీ అనంతరం అమిత్ షా స్పందించారు. సింధు అద్భుతమైన క్రీడాకారిణి. ఆమె అసాధారణమైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేసిందన్నారు. ఆట పట్ల ఆమె నిబద్ధత, చేసిన కృషి, అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ ట్వీట్ చేశారు.
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీడబ్లూసీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హైదరాబాద్ లోని తాజ్ హోటల్ కి చేరుకున్నారు. రెండు రోజుల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలలో భాగంగా తొలి రోజు సమావేశం తాజ్‌కృష్ణా హోటల్‌లో శనివారం ప్రారంభమైంది. అంతకుముందు సీడబ్లూసీ సమావేశ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీడబ్లూసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరవుతున్న కాంగ్రెస్ అగ్రనేతలకు కళాకారులు తమ నృత్యాలతో స్వాగతం పలికారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైలాన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. నార్లాపూర్ తొలి పంపు స్విచ్ చేసి ప్రారంభించారు.
CWC meeting: హైదరాబాద్ కు చేరుకున్న కాంగ్రెస్ పెద్దలు..
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు హైదరాబాద్ వచ్చిన అగ్రనేతలకు టీ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,మాజీ ఎంపీ వీ హనుమంతరావు స్వాగతం పలికారు. ప్రియాంకా గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే బోకె ఇచ్చి స్వాగతం పలికారు.
హైదరాబాద్ నానక్‍రామ్‍గూడలోని ORR జంక్షన్ నుంచి కారు ర్యాలీ తీశారు ఐటీ ఉద్యోగులు. ఎలాంటి ర్యాలీలకు పర్మిషన్ లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ వాటిన్నింటినీ పట్టించుకోకుండా ఐటీ ఉద్యోగులు ఓఆర్‌ఆర్ ఎక్కారు. చంద్రబాబు అరెస్టును ఖండించిన టెకీలు... కేసీఆర్‌పై మండిపడ్డారు. తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉంటే అక్కడ కూడా ఇలాంటి అభివృద్దీ జరిగేదన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి ప్రగతి భవన్ నుంచి పాలమూరుకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరిన సీఎం కేసీఆర్.
ISIS రాడికలైజేషన్, రిక్రూట్‌మెంట్ కేసులో తమిళనాడు, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఏక కాలంలో 30 ప్రదేశాల్లో దాడులు చేపట్టింది. కోయంబత్తూరులో 21, చెన్నైలో 3, హైదరాబాద్‌లో 5, తెన్‌కాశీలో 1 చోట తనిఖీలు చేస్తోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానమంత్రి మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై తెలంగాణ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఫామ్‌హౌస్ ప్లానింగ్, ఫామ్‌హౌస్ రియాల్టీ అంటూ లెక్కలతో వివరించేప్రయత్నం చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యుల్లో 33 శాతం మహిళలు ఉండాలని ఫామ్‌హౌస్ ప్లానింగ్‌లో ఉందని కానీ రియాల్టీలో అది చాలా దూరంగా ఉందంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసింది.
వంద మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే అందులో మహిళా ఎమ్మెల్యేలు 5 శాతం మందేనని... అంటే ఇక్కడ ఐదు శాతమే ఉన్నారని బీజేపీ విమర్సించింది. బీఆర్‌ఎస్ ఎంపీలు 16 మంది ఉంటే అందులో ఒక్కరంటే ఒక్కరే మహిలా ఎంపీ ఉన్నారని అంటే ఇక్కడ 6.25 శాతమేనంటూ గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కలుపుకున్నా 33 శాతం కావడం లేదని వ్యంగ్యంగా స్పందించింది బీజేపీ. అందుకే కేసీఆర్‌ది మోసపూరిత రాజకీయం అంటూ విమర్శలు చేసింది.
హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు వంద మంది వరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు హజరవుతున్నారు. ఇందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎంలు కూడా ఉన్నారు. వారిని ఆహ్వానిస్తూ బేనర్లు కనిపిస్తుంటే... వారికి వ్యతిరేకంగా కూడా కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. కరప్ట్ వర్కింగ్ కమిటీ” అంటూ పోస్టర్లు వేశారు ప్రత్యర్థులు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల వివరాలతో పోస్టర్లువేశారు. హోర్డింగ్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలు అందులో ఉంచారు. బివేర్ ఆఫ్ స్కామర్స్ (స్కాములు చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి) అంటూ టాగ్ లైన్ తో వెలసిన పోస్టర్లు.
Background
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) మరోసారి అభిమానుల మీద తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఫ్యాన్స్ గురించి ఆయన మాట్లాడిన ఒక్కో మాట గుండె లోతుల్లోంచి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన దుబాయ్ (Dubai)లో ఉన్నారు. సైమా 2023 (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. 'సైమా'లో ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పురస్కార వేడుకకు ఆయన కళ తీసుకు వచ్చారు. సైమా 2023లో 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాకు గాను ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు.
నేను కింద పడ్డప్పుడు పైకి లేపారు : ఎన్టీఆర్
ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి ఎన్టీఆర్ థాంక్స్ చెప్పారు. ''మళ్ళీ మళ్ళీ నన్ను నమ్మిన నా జక్కన్నకు థాంక్స్'' అని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్'లో తనతో పాటు నటించిన రామ్ చరణ్ (Ram Charan)కు కూడా థాంక్స్ చెప్పారు. అతడిని బ్రదర్ అని పేర్కొన్నారు. ఆ తర్వాత అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
''అభిమానులు అందరికీ థాంక్యూ. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు... నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా భాద పడినందుకు... నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు... నా అభిమాన సోదరులు అందరికీ పాదాభివందనాలు'' అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
'ఆర్ఆర్ఆర్'లో కొమురం భీముడిగా జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. యాక్షన్ దృశ్యాల్లో ఎంత వీరోచితంగా కనిపించారో... భావోద్వేగభరిత సన్నివేశాల్లో అంతలా కంటతడి పెట్టించారు. 'కొమురం భీముడో... కొమురం భీముడో' పాటలో ఆయన అభినయం అయితే ప్రేక్షకుల గుండెలను పిండేసింది. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్సులో ఎన్టీఆర్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించింది. ఆ నటనకు ఇప్పుడు సైమా అవార్డు వచ్చింది.
సైమా వేడుకల కోసం 'దేవర' చిత్రీకరణకు ఎన్టీఆర్ చిన్న బ్రేక్ ఇచ్చారు. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ సిటీలో 'దేవర' అండర్ వాటర్ సీక్వెన్సులు, యాక్షన్ సీన్లు తీస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' విడుదలైన తర్వాత సుమారు సంవత్సరం పాటు ఎన్టీఆర్ 'దేవర' స్క్రిప్ట్ వర్క్ జరిగింది. ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత చిన్న చిన్న బ్రేక్స్ ఇస్తూ... శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రానికి (RRR Movie) సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) పట్టం కట్టింది. ఈ ఏడాది సైమా వేడుకలో దుబాయ్ (Dubai)లో జరిగాయి. తెలుగు, కన్నడ భాషలకు చెందిన అవార్డులను శుక్రవారం ప్రదానం చేశారు. అందులో 'ఆర్ఆర్ఆర్' సినిమా హవా కనిపించింది.
ఉత్తమ నటుడు ఎన్టీఆరే...
'ఆర్‌ఆర్‌ఆర్'కు ఇంకా అవార్డులు!
ప్రేక్షకులు ముందుగా ఊహించినట్లు 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఇంకా దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ అవార్డులు అందుకున్నారు. సైమా 2023లో అత్యధిక అవార్డులు అందుకున్న సినిమా 'ఆర్ఆర్ఆర్' అని చెప్పవచ్చు. రాజమౌళి కుటుంబం ఈ అవార్డు వేడుకలకు హాజరు కాలేదు. రాజమౌళి అవార్డును జూనియర్ ఎన్టీఆర్ అందుకోగా... కీరవాణి అవార్డును చంద్రబోస్ అందుకున్నారు. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సైమా 2023 విజేతల వివరాలు
- ఉత్తమ నటుడు - ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్ సినిమా)
- ఉత్తమ నటి - శ్రీ లీల (ధమాకా సినిమా)
- ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్ సినిమా)
- ఉత్తమ సినిమా - సీతా రామం (వైజయంతి మూవీస్ అశ్వినీదత్, స్వప్న సినిమా)
- ఉత్తమ సంగీత దర్శకుడు - ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్ సినిమా)
- ఉత్తమ ఛాయాగ్రాహకుడు - కె. సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్ సినిమా)
- ఉత్తమ సాహిత్యం - చంద్రబోస్ (ఆర్ఆర్ఆర్ సినిమా)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - అడివి శేష్ (మేజర్ సినిమా)
- ఉత్తమ నటి (క్రిటిక్స్) - మృణాల్ ఠాకూర్ (సీతా రామం సినిమా)
- బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - వశిష్ఠ (బింబిసార సినిమా)
- బెస్ట్ డెబ్యూ (హీరో) - అశోక్ గల్లా (హీరో సినిమా)
- బెస్ట్ డెబ్యూ (హీరోయిన్) - మృణాల్ ఠాకూర్ (సీతా రామం సినిమా)
- బెస్ట్ డెబ్యూడెంట్ ప్రొడ్యూసర్స్ - శరత్ & అనురాగ్ (మేజర్ సినిమా)
- సెన్సేషనల్ ఆఫ్ ది ఇయర్ - కార్తికేయ 2
- ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్ సినిమా)
- ఉత్తమ సహాయ నటి - సంగీత (మాసూద సినిమా)
- ఉత్తమ విలన్ - సుహాస్ (హిట్ 2 సినిమా)
- ఉత్తమ హాస్యనటుడు - శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2 సినిమా)
- ఫ్యాషన్ యూత్ ఐకాన్ - శృతి హాసన్!
- ప్రామిసింగ్ స్టార్ - బెల్లంకొండ గణేష్!
- - - - - - - - - Advertisement - - - - - - - - -