Breaking News Live Telugu Updates: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ - 90 శాతం హామీలు అమలు చేశామని వెల్లడి

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 15 Oct 2023 02:48 PM
మరో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు: సీఎం కేసీఆర్

హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇళ్లు ఉన్న వారికి గృహలక్ష్మీ కొనసాగిస్తూనే.. ఇళ్ల స్థలాలు లేని వారికి స్థలాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో వివరించారు.

'సౌభాగ్య లక్ష్మీ' పథకం - పేద మహిళలకు రూ.3 వేలు

సౌభాగ్య లక్ష్మీ పథకం కింద బీపీఎల్‌ కింద ఉన్న పేద మహిళలకు రూ.3 వేల గౌరవ భృతి ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలు: సీఎం కేసీఆర్

ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అని పేరు పెట్టారు. అర్హులైన మహిళలకు రూ.3 వేల భృతి అందిస్తామన్నారు. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400కే సబ్సిడీ సిలిండర్ అందిస్తామని వెల్లడించారు. 

రైతు బంధు పథకం ద్వారా రూ.16 వేలు: సీఎం కేసీఆర్

రైతు బంధు పథకం ద్వారా రూ.16 వేలు అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీన్ని దశలవారీగా పెంచనున్నట్లు పేర్కొన్నారు.  

వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంపు: సీఎం కేసీఆర్

వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీన్ని కూడా దశల వారీగా చేయనున్నట్లు తెలిపారు. 

పెన్షన్ రూ.5 వేలకు పెంపు - దశలవారీగా పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటన

ఆసరా పింఛన్లు రూ.5 వేలకు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. దశలవారీగా పెన్షన్ పెంపు అమలు చేస్తామన్నారు. తొలుత రూ.3 వేలు ఇచ్చి క్రమంగా ఏడాదికోసారి పెన్షన్ పెంచనున్నట్లు చెప్పారు. 

'అన్నపూర్ణ పథకం' - రేషన్ కార్డులున్న వారికి సన్నబియ్యం

తెలంగాణ 'అన్నపూర్ణ పథకం' కింద తెల్ల రేషన్ కార్డులున్న వారందరికీ సన్న బియ్యం అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు.

రేషన్ కార్డుదారులకు 'కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా' పేరిట బీమా పథకం: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి కుటుంబానికి 'కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా' పేరిట బీమా చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఎల్ఐసీ ద్వారా బీమా సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఇది రైతు బీమా తరహాలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పథకంతో 93 లక్షల పైచిలుకు వారికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి రూ.3600 నుంచి రూ.4 వేలు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచే నాలుగైదు నెలల్లోనే దీన్ని అమలు చేస్తామన్నారు. రైతు బీమా తరహాలోనే రూ.5 లక్షల కేసీఆర్ బీమా అందిస్తామన్నారు.

దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తాం: సీఎం కేసీఆర్

దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వారికి బడ్జెట్ పెంచినట్లు చెప్పారు. మైనార్టీ జూనియర్ కళాశాలలను డిగ్రీ కాలేజీలుగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, బీసీలకు అమలు చేస్తున్న పథకాలను సైతం కొనసాగిస్తామన్నారు.

బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ - 90 శాతం హామీలు అమలు చేశాం

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటిస్తున్నారు. ఎన్నికల ప్రణాళిక రూపంలో 10 శాతం చెప్తే 90 శాతం హామీలు అమలు చేసినట్లు చెప్పారు. గతంలో మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేసినట్లు పేర్కొన్నారు. రైతు బంధును మేనిఫెస్టోలో చేర్చలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించారు. స్వయంగా ఆయనే పల్లాకు బీఫామ్ అందజేశారు. 

ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్కు అందించిన కేసీఆర్

రెండు రోజుల్లో అందరికీ బీఫామ్స్ అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. టిక్కెట్ రాని వారు తొందర పడొద్దని, అందరికీ అవకాశాలుంటాయని చెప్పారు. కాగా, ఐదుగురు అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పటికే 5 చోట్ల అభ్యర్థులు పెండింగ్ లో ఉన్నారు. 51 మందికి బీఫామ్స్ అందించిన కేసీఆర్ ఒక్కొక్కరికి రూ.40 లక్షల చెక్కు అందించారు.

ఐదుగురు అభ్యర్థులను మార్చే ఛాన్స్.?

తెలంగాణ భవన్ లో 51 మంది అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫామ్స్ అందజేశారు. అయితే, ఐదుగురు అభ్యర్థులను మార్చే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 114 నియోజకవర్గాల అభ్యర్థులకు  ఆదివారం బీఫామ్ ఇస్తారని తొలుత ప్రకటించినా, 51 మందికి మాత్రమే బీఫామ్స్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. దీంతో మిగతా అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

ప్రజల్లో గెలిచినా సాంకేతికంగా దెబ్బ తీస్తారు: కేసీఆర్

బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లో గెలిచినా సాంకేతికంగా దెబ్బ తీయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతీ కార్యకర్తతోనూ నేతలు మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రచార వ్యూహంపై గులాబీ బాస్ దిశా నిర్దేశం చేశారు.

మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం: సీఎం కేసీఆర్

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం. ఎవరూ తొందరపడొద్దని బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్ లో ఆయన అభ్యర్థులతో సమావేశమయ్యారు. సాంకేతికగా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, కోప తాపాలను అభ్యర్థులు పక్కన పెట్టాలని అన్నారు. ప్రతి విషయంపై అభ్యర్థులు క్లారిటీతో ఉండాలని, అభ్యర్థులకు 2 రోజుల్లో భీపామ్స్ అందిస్తామని తెలిపారు.

కాంగ్రెస్‌ జాబితా ఇదే

కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల -55 మంది అభ్యర్థులతో ఫస్ట్‌ లిస్ట్‌ 

కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల -55 మంది అభ్యర్థులతో ఫస్ట్‌ లిస్ట్‌ 
బెల్లంపల్లి - గడ్డం వినోద్‌
మంచిర్యాల- ప్రేమ్‌సాగర్

Background

KCR To Release BRS Manifesto: తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఇటీవల ఈసీ విడుదల చేసింది. దాంతో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోపై ఫోకస్ చేశారు. ఇదివరకే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 15 (ఆదివారం) మధ్యాహ్నం 12.15 కు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. అదే రోజు అభ్యర్థులకు కేసీఆర్ బి ఫామ్ ఇవ్వనున్నారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా ఉంటుందని హరీష్ రావు, కేటీఆర్ లు చెప్పడంతో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజలతో పాటు విపక్షాలలోనూ ఉత్కంఠ నెలకొంది. 


గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ కి 5 రోజుల ముందు బీఆర్‌ఎస్‌ పార్టీ (అప్పటి టీఆర్ఎస్ పార్టీ) మేనిఫెస్టోను ప్రకటించింది. కానీ ఈసారి అభ్యర్థులను చాలా త్వరగానే ప్రకటించిన సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోతో మ్యాజిక్ చేయాలని భావిస్తున్నారు. 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా సీఎం కేసీఆర్ కొన్ని నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి 2018లోనే ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు.  


రైతు బంధు, రైతు భీమాపై ప్రకటనలు ఉంటాయని అన్నదాతలు భావిస్తున్నారు. గృహిణుల కోసం ప్రకటన ఉంటుందని మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆసరా పింఛన్ల పెంపు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాల అమలు వేగవంతం చేసే విధంగా కేసీఆర్ మరిన్ని వరాలు ప్రకటిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న కేసీఆర్.. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లతో ప్రత్యేకంగా సమావేశమై బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు తుది మెరుగులు దిద్దినట్లు సమాచారం. ప్రతిపక్షాల వ్యూహాలకు చెక్‌ పెట్టేలా, అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. 









16న సీఎం కేసీఆర్ సభ
అక్టోబర్ 16వ తేదీన జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. జనగామలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. జిల్లాకు సాగునీరు, తాగునీరు వచ్చిందన్నారు. జనగామ పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.