Live News Updates: శ్రీశైలం చేరుకున్న అమిత్ షా.. ఘన స్వాగతం

ABP Desam Last Updated: 12 Aug 2021 12:41 PM
కీలక మావోయిస్టులు అరెస్టు

ఏపీ-ఒడిశా సరిహద్దులో కీలక మావోయిస్టులు ఆరుగురు అరెస్టయినట్లుగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో డివిజనల్ కమాండర్ సహా మరికొంత మంది నేతలు ఉన్నట్లు వెల్లడించారు. మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందని డీజీపీ అన్నారు. వీరిలో గాదర్ల రవి అనే వ్యక్తి తమ ఎదుట లొంగిపోయినట్లు చెప్పారు. గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ ఈ వివరాలు వెల్లడించారు. 

కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ మరో లేఖ

కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఏపీ అక్రమంగా నీటిని తరలించకుండా చూడాలని ఈఎన్‌సీ మురళీధర్ విజ్ఞప్తి చేశారు. అనుమతి లేని ప్రాజెక్టుల ద్వారా తరలింపు అడ్డుకోవాలని కోరారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల, మాల్యాల పంపింగ్ స్టేషన్, బనకచర్ల రెగ్యులేటర్ నుంచి నీటి తరలింపు ఆపాలని ఈఎన్‌సీ విజ్ఞప్తి చేశారు.

దర్శనాల నిలిపివేత

శ్రీశైలంలో సాధారణ భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శ్రీశైల మల్లన్న దర్శనం నేపథ్యంలో దేవస్థానం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం ఆరు గంటలకు దర్శనాలు పున:ప్రారంభించనున్నారు.

శ్రీశైలం చేరుకున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం చేరుకున్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి విమానంలో చేరుకున్న ఆయన అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ బీజేపీ నేతలు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

ఈ నెల 16న హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లి (ఇందిరానగర్)లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరిగే ప్రాంగణాన్ని మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి పర్యటన, ఏర్పాట్లను మంత్రులు సమీక్షించారు. అధికారులకు మంత్రి హరీశ్ రావు పలు సూచనలు చేశారు.

నోముల భగత్ ప్రమాణ స్వీకారం

ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలుపొందిన నోముల భగత్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నోముల భగత్ చేత శాసనసభలో సభ్యుడిగా శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు ఈ సందర్భంగా నోముల భగత్‌కు అందించారు.



రష్యాలో హెలికాప్టర్ ప్రమాదం

రష్యాలో ఓ పర్యటకుల విమానం ప్రమాదానికి గురైంది. ఎంఐ-8 రకానికి చెందిన  హెలికాప్టర్‌ గురువారం తెల్లవారుజామున సరస్సులో కుప్పకూలిపోయింది. ఇందులో 13 మంది పర్యటకులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. అయితే, వీరిలో 9 మందిని కాపాడినట్లుగా అధికారులు ప్రకటించగా.. మిగతా వారు గల్లంతయ్యారు. రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో ద్వీపకల్పంలో కురిల్ సరస్సులో హెలికాప్టర్‌ కూలింది. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. రష్యాలోని కమ్చట్కా ప్రాంతంలో జన సాంద్రత చాలా తక్కువ. అగ్నిపర్వతాలు, కొండలతో దృశ్యాలు కట్టిపడేసేలా ఉంటాయి. ఇక్కడికి పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.



వెంకయ్యను కలవనున్న విపక్ష నేతలు

విపక్షనేతలు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మధ్యా్హ్నం 12.15కు కలవనున్నారు. పెగాసస్ స్పైవేర్, వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, శివసేన సహా విపక్షాలకు చెందిన నేతలు ఉప రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. గురువారం వీరు ఢిల్లీలో విజయ్ చౌక్ వద్ద నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.

Background

హైదరాబాద్‌లో కిడ్నాప్‌కు గురై దారుణ హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయభాస్కర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాబా లోక్‌నాథ్ అలియాస్ గురూజీని పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులుగా పరారీలో ఉన్న ఆయన్ను పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.