Anganwadis State Strike: ఏపీ సర్కార్‌ (AP Government) అంగన్వాడీ(Anganwadis)లకు వార్నింగ్‌ ఇచ్చింది. సమ్మె (Strike ) విరమించుకోవాలని సమ్మె వీడకపోతే విధులకు గైర్హాజరైనట్లుగా భావించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సమ్మెను విరమించాలని మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రస్తావించిన వివిధ అంశాలు సానుకూలంగా పరిశీలించినట్లు వెల్లడించింది. యూనియన్లతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంగన్వాడీలు, సహాయకుల వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సర్వీసు చివరికి రూ. 50వేల నుంచి రూ.లక్ష పెంచేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. హెల్పర్ల సర్వీసు చివరికి బెనిఫిట్‌ను రూ.20 వేల నుంచి రూ. 40వేలకు పెంచుతున్నట్లు తెలిపింది. అంగన్వాడీలకు టీఏ, డీఏలను ప్రభుత్వ నిధుల నుంచి విడుదల చేయడానికి అంగీకరించింది. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్‌ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


కలెక్టరేట్లు, సబ్‌ కలెక్టరేట్లు, ఐసీడీఎస్ కేంద్రాల వద్ద...


ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నుంచి అంగన్‌వాడీలు రోడ్డెక్కారు. సుదీర్ఘకాలం పాటు ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, వైసీపీ అధికారంలోకి రావడానికి ముందు జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిరవధిక సమ్మెకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అంగన్‌వాడీలు సమ్మెలో పాల్గొన్నారు. కలెక్టరేట్లు, సబ్‌ కలెక్టరేట్లు, ఐసీడీఎస్ కేంద్రాల వద్ద అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, హెల్పర్లు ఆందోళనలో పాల్గొన్నారు. కనీస జీతం 26 వేల రూపాయలు ఇవ్వాలని, టీఏ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని అంగన్‌వాడీ వర్కర్లు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలుచేయాలని, మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చాలని, అన్ని కేంద్రాల్లోనూ కనీస సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు. 


అంగన్‌వాడీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని...


అంగన్‌వాడీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ 5 లక్షలు పెంచాలని, చివరగా అందుకునే జీతంలో 50 శాతం పెన్షన్‌ ఇవ్వాలని, సర్వీసులో ఉంటూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అందివ్వాలని డిమాండ్‌ చేశారు. FRS యాప్‌ రద్దు చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో 45 రోజుల పాటు వేసవి సెలవులు ఇవ్వాలని కోరారు. అంగన్‌వాడీ సెంటర్లు మూసేసి తమ నిరసన తెలిపారు అంగన్‌ వాడీ వర్కర్లు. 


ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిరవధిక సమ్మెలు కొనసాగాయి. ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, మూతపడ్డవాటిని తెరవాలని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, హెల్పర్లు నినదించారు. హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిటైర్మెంట్‌ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల ఆందోళనతో ఏపీ వ్యాప్తంగా 56 వేల సెంటర్లలో సేవలు నిలిచిపోయాయి. లక్ష మందికి పైగా అంగన్‌వాడీలు ధర్నాలో పాల్గొన్నారు. అంగన్‌వాడీల ఆందోళనకు కమ్యునిస్ట్‌ పార్టీల నేతలు, టీడీపీ నేతలు మద్దతు ప్రకటించారు.