విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విదేశీ విద్యా దీవెన నిధులు ఇవాళ విడుదల చేయనుంది. దీంతోపాటు సివిల్ సర్వీస్‌ ప్రోత్సాహకాలను కూడా జగన్ రిలీజ్ చేయనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకునే 390 మంది విద్యార్థుల కోసం 41.6 కోట్ల రూపాయల నిధులు ఇవాళ ఇవ్వబోతున్నారు. సివిల్స్ ప్రిలిమ్స్‌ దాటి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న 95 మంది, మెయిన్స్‌లో మంచి ర్యాక్ సాధించి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్న 11 మంది అభ్యర్థుల కోసం కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేయనుంది. 


విదేశాల్లో చదువుకోవాలనే కోరిక చాలామందిలో ఉంటుంది. అయితే ఆర్థిక స్తోమత లేని చాలా మంది ఆ కోరికను చంపుకుంటారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం విద్యా దీవెను పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రపంచంలోని ఏ యూనివర్శిటీలోనైనా చదువుకోవచ్చని చెప్పింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపై కొన్ని ఆంక్షలు పెట్టింది. ప్రపంచంలో అత్యుత్తమ ర్యాంకు పొందిన యూనివర్శిటీల్లో సీటు వస్తేనే డబ్బులు ఇస్తామని మెలిక పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 300లకుపైగా కళాశాలల్లో మాత్రమే సీటు పొందితే డబ్బులు చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఒక్కొక్కరికి  1.25 కోట్లు చెల్లిస్తారు. ఇతరులకు కోటి రూపాయలు ఇస్తారు. దీనికి అదనంగా వీసా, ప్రయాణ ఖర్చులు ప్రభుత్వం భరించనుంది. 21 ఫ్యాకల్టీల్లో చదువుకునే వెసులుబాటు కల్పించారు. 


సివిల్ సర్వీస్‌ పరీక్షలో ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్‌ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి లక్ష రూపాయలు, మెయిన్స్‌లో మంచి ర్యాంకు వచ్చి ఇంటర్య్వూ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి 50 వేల రూపాయల సాయం ప్రభుత్వం అందిస్తోంది. 


రేపు(గురువారం) ట్యాబ్‌ల పంపిణీ


ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లిలో పర్యటిస్తారు. ఉదయం 8.30కి తాడేపల్లి నుంచి బయల్దేరి చింతపల్లి చేరుకుంటారు. అక్కడ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తారు. గిరిజన విద్యార్థులతో మాట్లాడి బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభను స్థానిక ప్రభుత్వం డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తాడేపల్లి చేరుకుంటారు. 


29న విద్యాదీవెన నిధులు 


విద్యాదీవెన నిధులు కూడా విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ నిధులు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ విడుదల చేయలేదు. తుపాను కారణంగా విడుదల ఆలస్యమైందని చెప్పుకొస్తోంది ప్రభుత్వం. జులై–సెప్టెంబరు నెలకు సంబంధించిన విద్యాదీవెను నిధులను 29వ తేదీన భీమవరంలో జగన్ విడుదల చేస్తారు. 26.98 మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన 25.17 లక్షల రూపాయలను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.


విద్యాదీవెన పథకానికి పరిమితి లేదని ప్రభుత్వం చెబుతోంది. కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ ఈ పథకం వరిస్తుందని వారి ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుందని అంటున్నారు. గరిష్టంగా 3.05 లక్షలు రీయింబర్స్‌మెంట్ అవుతున్నట్టు పేర్కొంటున్నారు. విద్యాదీవెన డబ్బులు పడిన 3 వారాల్లో కాలేజీలకు చెల్లించాలని రూల్ పెట్టారు. అలా చెల్లించకుంటే కాలేజీలు ఫిర్యాదు చేయవచ్చు. అలాంటి సమయంలో తర్వత విడత డబ్బులను నేరుగా తల్లుల ఖాతాల్లో కాకుండా కాలేజీకి చెల్లిస్తారు.