MP Margani Bharath: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం గోదావరి జిల్లాల్లో చేసిన పర్యటన ఉత్తి దండగ అని ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. రైతులకు వైసీపీ సర్కారు సాయం చేయలేదని చంద్రబాబు చెప్పడం దారుణం అన్నారు. 58 లక్షల మంది రైతులకు ప్రతీ ఏటా సాయం చేస్తున్నామని చెప్పారు. బషీర్ బాగ్ ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేరని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట నష్టం కూడా చెల్లిస్తోందని వివరించారు. ఓటుకు నోటు కేసులో దోరికి ఏపీకి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అంటూ కామెంట్లు చేశారు. పుష్కరాల సమయంలో 29 మంది పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికీ వారిని కనీసం పరామర్శించని ఆయన... రైతులను పరామర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే ఆర్థిక నేరాలు చేసే వారికి వత్తాసు పలుకుతున్నారని, బ్లూ మీడియా అంటూ చంద్రబాబు మాట్లాడడం సరికాదని చెప్పారు. మహానాడు సభలో అందరి ముందు బహిరంగంగా.. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఎంపీ భరత్ రామ్ సవాల్ విసిరారు. అలాగే మీడియా ఛానెల్  ప్రతినిధులను బాని బతుకులు బతుకున్నారంటూ కామెంట్లు చేయడం సరికాదని సూచించారు. 



వాళ్లు కుంభకోణాలకు పాల్పడడం వల్లే అరెస్టయ్యారు..!


రాజమండ్రిలో టీడీపీకి చెందిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌, ఆదిరెడ్డి అప్పారావును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ మార్గాని భరత్ నాలుగు రోజుల క్రితమే స్పందించారు. తండ్రీ, కుమారులైన వీరిని రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీరు కుంభకోణాలకు పాల్పడడం వల్లే అరెస్టు చేశారని మార్గాని భరత్ ఆరోపించారు. వారు జగజ్జనని చిట్స్‌ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ చిట్ ఫండ్ కంపెనీలో ప్రజల నుంచి సేకరించిన డబ్బులను వారి మరో కంపెనీలకు మళ్లించి ప్రైవేటు ఆస్తులు కొనుగోలు చేశారని అన్నారు. ఎంపీ భరత్‌ మంగళవారం (ఏప్రిల్ 2) రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. 


ఆదిరెడ్డి శ్రీనివాస్, అప్పారావు విషయంలో కక్ష సాధింపుకు ప్రభుత్వం పాల్పడిందని కొందరు అంటున్నారని, ఆదిరెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మార్గాని భరత్ అన్నారు. ఆదిరెడ్డిపై ఫోర్జరీ సంతకాలు చేసిన కేసు కూడా ఉందని అన్నారు. చిట్‌ ఫండ్స్‌ చట్టం సెక్షన్-5 ప్రకారం అరెస్టులు జరిగాయని, 20 వేలకు మించిన లావాదేవీలపై క్యాష్ రిసీట్స్ తీసుకోవడానికి అవకాశం లేదని అన్నారు. కానీ, కోట్ల రూపాయల లావాదేవీలు జగజ్జననిలో జరిగినట్టు అధికారులు గుర్తించారని అన్నారు. ఎక్కడా నిబంధనలు పాటించలేదని అన్నారు. అక్రమాలు చేసే సంస్థలను ప్రభుత్వం ఎట్టి పరిస్థిత్తుల్లో ఉపేక్షించబోదని చెప్పారు. జగజ్జనని కూడా మార్గదర్శి సంస్థలాంటిదేనని, జగజ్జనని చిట్ ఫండ్ బాధితులు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ప్రోపర్ రికార్డ్ మైంటైన్ చేయకుండా మోసాలు జరుగుతున్నాయన్నారు. మహానాడు దగ్గర పడుతుందని అరెస్ట్ చేశామని వైఎస్ఆర్ సీపీ నేతలపై మండిపడడం కరెక్ట్ కాదని మార్గాని భరత్ అన్నారు.