APSRTC News: విమాన ప్రయాణాల తరహాలోనే ఆర్టీసీ బస్సుల్లోనూ మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశ పెట్టబోతున్నట్లు వెల్లడించింది. ఒక పట్టణం లేదా నగరం నుంచి మరో పట్టణం, నగరానికి నేరుగా బస్సు సౌకర్యం లేనప్పుడు బ్రేక్ జర్నీ విధానంలో ఆన్ లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తిరుపతి నుంచి భద్రాచలం వెళ్లేందుకు నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తిరుపతి నుంచి విజయవాడకు, అక్కడి నుంచి భద్రాచలానికి ఒకేసారి రిజర్వేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నై, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకు కూడా బస్ రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. బ్రేక్ జర్నీ సమయం కనీసం రెండు గంటల నుంచి గరిష్టంగా 22 గంటల వరకు ఉండొచ్చు. మొదటి దశలో రాష్ట్రంలో 137 పట్టణాలు, నగరాల నుంచి ఈ మల్టీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశ పెట్టింది. ఆ తర్వాత దశల్లో మరిన్ని పట్టణాలకు ఈ సౌలభ్యాన్ని విస్తరించనుంది. 


ఇటీవలే 12 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చిన ఏపీఎస్ఆర్టీసీ


ఇటీవలే ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా 12 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటిని కడప నుంచి తిరుమల మార్గంలో నడపబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం రోజు కడప డిపోలో ఈ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం 12 బస్సులను గాను 6 బస్సులు నాన్ స్టాప్ గా నడవబోతున్నాయి. మరో ఆరు బస్సులు అవసరాన్ని బట్టి తిరుగుతాయి. తెల్లవారు జాము 4.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. కడప నుంచి తిరుమలకు వెళ్లే పెద్దలకు అయితే రూ.340, పిల్లకు అయితే రూ.260 చొప్పున ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ సందర్భంగానే ఛైర్మన్ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ... అన్ని డిపోల్లో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.






ఇప్పటికే తిరుమల - తిరుపతి మధ్య 50 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు - తిరుమల మధ్య 14, తిరుపతి - మదనపల్లె మధ్య 12, తిరుపతి - నెల్లూరు మధ్య 12 బస్సులు నడపనున్నట్లు మల్లికార్జున్ రెడ్డి వివరించారు. 


గతేడాది అక్టోబర్ నుంచి బస్సుల్లోనూ డిజిటల్ పేమెంట్స్


నోట్ల రద్దు, కరోనా పరిస్థితుల తర్వాత దేశంలో డిజిటల్ పేమెంట్స్ వాడకం పెరిగింది. క్యాష్ లెస్ పేమెంట్స్ వైపు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆన్ లైన్ పేమెంట్స్ అమల్లోకి రావడంతో ఆ దిశగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. బస్సు ప్రయాణాల్లో నగదు, చిల్లర సమస్యలను పరిష్కరించేందుకు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. యూనిఫైడ్ టిక్కెటింగ్ సొల్యూషన్ పేరిట డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌ పే వంటి యూపీఐ పేమెంట్స్ ద్వారా బస్సు టికెట్‌ను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది.