Mukesh Ambani: కోట్లాది రూపాయలతో సెట్టింగ్‌లు, వేలాది రకాల వంటలతో అతిథులకు విందు భోజనాలు...వారం, పదిరోజుల పాటు గానాభజానాలతో  పెళ్లివేడుకలు నిర్వహిస్తున్నారు. ఓ మోస్తరు కలిగిన కుటుంబాల్లో పెళ్లిళ్లకు ఖర్చు వంద కోట్లుకు పైగా దాటిపోతుంది. ఆ వేడుకల వైపు కాదుకదా..కనీసం వాళ్లి ఇంటి గోడలవైపు కూడా సామాన్యులు చూసే సాహసం చేయరు. ఆ దరిదాపుల్లోకి కూడా ఎవ్వరిని రానివ్వరు. కానీ ఆసియా అపర కుభేరుడిగా పేరుగాంచిన రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) ఇంటి పెళ్లి వేడుకలకు సామాన్య ప్రజలను ఆహ్వానించడమే కాదు...స్వయంగా ముఖేశ్ అంబానీనే కొసరి కొసరి వడ్డించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పల్లెప్రజలతో కలిసి పాల్గొని పెద్దమనసు చాటుకున్నారు.






ముఖేష్అంబానీ పెద్దమనసు   
రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్అంబానీ(Mukesh Ambani) ఇంట పెళ్లివేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధికమార్చంట్ వివాహం జులైలో జరగనుండగా....మార్చి 1 నుంచి మూడు రోజులపాటు ముందస్తు పెళ్లివేడుకలు నిర్వహించనున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌(Jamnagar)లో దీనికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవిదేశాల నుంచి తరలిరానున్న అతిథుల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.ఫైవ్‌స్టార్ హోటల్ సౌకర్యాలతో వసతి సౌకర్యాలు, 2500 రకాల వంటలతో విందు భోజనాలు పెట్టనున్నారు.  జామ్‌నగర్‌కు సమీపంలోని రిలయన్స్‌ టౌన్ షిప్ వద్ద నెలరోజుల నుంచే వీటికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న తంతు గురించి చుట్టు పక్కల ప్రాంతాల వారు కథలు, కథలుగా చెప్పుకుంటున్నవారు కొందరైతే...ఏం చేసినా, ఎంతఖర్చు పెట్టినా మనల్ని ఏమైనా పిలుస్తారా ఏంటీ అని విమర్శించిన వాళ్లు ఉన్నారు. కనీసనం మనల్ని  ఆ చుట్టుపక్కలకు కూడా రానివ్వరని విసుక్కునే వారు ఉన్నారు. కానీ ముఖేష్ అంబానీ(Mukesh Ambani) చాలా పెద్దమనసు  చాటుకున్నారు. తన కుమారుడి వివాహ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల వారందరినీ ఆహ్వానించారు. పెళ్లికి ముందే వారందరికీ అన్నసేవా కార్యక్రమంలో భాగంగా విందు భోజనాలు వడ్డించారు. రిలయన్స్ టౌన్‌షిప్‌కు సమీపంలోని జోగ్‌వాడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖేశ్ అంబానీతోపాటు వధూవరులు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్యులకు స్వయంగా ముఖేశ్ అంబానీనే కొసరికొసరి వడ్డించారు. తమ బిడ్డను ఆశీర్వదించాల్సిందిగా అందిరినీ కోరారు. గుజరాతీ సంప్రదాయ వంటకాలను విందుభోజనంలో చేర్చారు. అందరికీ స్వీట్లు వడ్డించిన ముఖేష్అంబానీ వారి కళ్లల్లో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూశారు. నూతన వధూవరులను ఆయన గ్రామస్తులకు పరిచయం చేశారు.

విందు, వినోదం 
విందు భోజనం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గ్రామస్తులతో కలిసి ముఖేష్అంబానీ కుటుంబం పాల్గొంది. వారితో కలిసి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో వధువు కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు. తమ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పదార్థాల రుచి చూడలేదని స్థానికులు తెలిపారు. లక్షల కోట్ల అధిపతి అయిన ఆయన మాకు స్వయంగా వడ్డించడాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. ఆయన విలువైన సమయాన్ని మాతో గడపడం ఆనందంగా ఉందన్నారు. మొత్తం 51 వేలమంది గ్రామాస్తులకు విందు భోజనం వడ్డించనున్నారు. వీరందరికీ ఒకేరోజు కాకుండా కొన్నిరోజుల పాటు ఈ అన్నసేవా కార్యక్రమం కొనసాగనుంది. పెళ్లి వేడుకలకు సామాన్యలను పిలిచి విందు భోజనం పెట్టడంపై ముఖేశ్‌ గొప్పతనాన్ని పలువురు ప్రసంసిస్తున్నారు.