TS DSC 2024: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి గురువారం(ఫిబ్రవరి 29) డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడ‌నుంది. మే 3వ వారంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ-2024) నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. టీచర్‌ పోస్టుల భర్తీకి పది రోజులపాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహించ‌నున్నారు.  మొత్తం 11,062 పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించింది. దీంతో ఫిబ్రవరి 29న నోటిఫికేషన్‌ విడుదలచేయనున్నారు. పాత నోటిఫికేషన్‌కు అదనంగా మరో 5,973 టీచర్‌ పోస్టులను భర్తీచేసేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆర్థికశాఖ ఫిబ్రవరి 26న రెండు వేర్వేరు జీవోలను విడుదల చేసింది. జీవో -27 ద్వారా 4,957 పోస్టుల భర్తీ.. 1,016 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ఉద్యోగాల నియామకానికి జీవో -26ను ఆర్థికశాఖ జారీచేసింది.


వాస్తవానికి ఫిబ్రవరి 28న డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ విడుదలచేయాలని అధికారులు భావించినప్పటికీ.. షెడ్యూల్‌ ఖరారు, సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉండటంతో వాయిదావేశారు. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలచేశారు. వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు.


ఎస్‌జీటీ పోస్టులే అధికం..
విద్యాశాఖలో మొత్తం 21 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. వాటిలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ)లను నేరుగా నియమించడానికి వీలుంది. కాబట్టి ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్‌లో ప్రకటించే మొత్తం 11,062 ఖాళీల్లో 6,500 ఎస్‌జీటీ పోస్టులు ఉండనున్నాయి. అయితే స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. పదోన్నతుల ద్వారా ఎస్‌జీటీలతో 70 శాతం వరకూ భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం నేరుగా నియామకం చేపట్టనున్నారు. పదోన్నతులకు సంబంధించి న్యాయ వివాదం ఉండటంతో ఎస్‌ఏ పోస్టులపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాబట్టి 1,500-2,000 వరకూ ఎస్‌ఏ పోస్టులను నేరుగా డీఎస్సీ ద్వారా చేపట్టే వీలుంది. భాషా పండితులు, పీఈటీలు ఇతర పోస్టులు కలుపుకొని మొత్తం 11,062 పోస్టులు భ‌ర్తీ చేయనున్నారు. గతేడాది ప్రకటించిన డీఎస్సీకి 1,77,502 దరఖాస్తులొచ్చాయి. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


సమస్య తలెత్తకుండా అధికారుల జాగ్రత్తలు.. 
రాష్ట్రంలోని నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్‌పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 4 లక్షల మంది ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఉత్తీర్ణులయ్యారు. వాళ్లంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాలు మొదలుకొని ఫలితాల వరకూ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనపై మరింతగా దృష్టి పెట్టారు. పాస్‌వర్డ్స్, ఆన్‌లైన్‌ వ్యవస్థ భద్రతాంశాలను ఉన్నతాధికారులు సమీక్షించారు. సాంకేతిక విభాగంలో ప్రైవేటు సంస్థల పాత్ర ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు విద్యాశాఖ సిబ్బందిని ఆదేశించారు. కీలకపాత్ర పోషించే అధికారులు ప్రతి అంశాన్నీ పరిశీలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.


పాతనోటిఫికేషన్‌ రద్దు..
తెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ-2023 నోటిఫికేషన్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసింది. 5089 టీచర్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ఫిబ్రవరి 28న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని పోస్టులతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు.. మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఒకట్రెండు రోజుల్లోనే దాదాపు 11వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో 2023లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..