Anant Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ ఎండీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక ప్రారంభమైంది. ఈ నెల 12వ తేదీన వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ముహూర్తం ఖరారు చేశాయి. ఇప్పటికే అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది అంబానీ కుటుంబం. గుజరాతీ వివాహాల్లో నిర్వహించే మామేరు వేడుకను జూలై 3న అంటే బుధవారం నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. అంబానీ హౌస్ యాంటిలియాలో మామేరు వేడుక జరిగింది. మామేరు వేడుక గురించి చాలా మందికి తెలియదు. మామేరు వేడుక అంటే ఏమిటి, ఎందుకు చేస్తారు? తెలుసుకుందాం.
మామేరు వేడుక అంటే ఏమిటి?
గుజరాతీ వివాహాలలో మామేరు అనేది ఒక ప్రత్యేక సంప్రదాయం. ఇందులో కాబోయే కోడలికి అత్తామామలు స్వీట్లు తినిపించి కానుకలు అందజేస్తారు. ఈ వేడుకలో కాబోయే కోడలికి చీర, బంగారు ఆభరణాలు, గాజులు, మిఠాయిలు వంటివి కానుకగా ఇచ్చారు. అంతే కాకుండా స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ కూడా బహుమతిగా అందించారు. ఈ మామేరు వేడుకలో రాధికా మర్చంట్ ఎంబ్రాయిడరీ లెహంగాలో మెరిసిపోయారు. ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్‌తో ఈ లెహెంగాను మనీశ్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఈ వేడుకకు తన తల్లికి చెందిన ఆభరణాలను ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నందున నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె సోదరి మమతా దలాల్, ఇతర సన్నిహిత బంధువులు రాధికా మర్చంట్‌ను ఆశీర్వదించారు.
ముస్తాబైన యాంటిలియా
మామేరు వేడుక కోసం యాంటిలియాను ఎరుపు, గులాబీ, నారింజ రంగులతో అలంకరించారు. "ఆల్ ది బెస్ట్" అనే పదాలతో కూడిన డిజిటల్ స్క్రీన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు రాధిక స్నేహితురాలు జాన్వీ కపూర్ కూడా హాజరయ్యారు. కూతురు ఆరాధ్యతో ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా వచ్చారు.
జూన్ 29నుంచి వేడుకలు ప్రారంభం
నీతా, ముఖేష్ అంబానీల చిన్న కుమారుడు అనంత్ వివాహ కార్యక్రమాలు జూన్ 29న పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. జూలై 2 న అంబానీ కుటుంబం మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో 50 మందికి పైగా నిరుపేద జంటలకు సామూహిక వివాహాన్ని నిర్వహించింది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకలో జస్టిన్ బీబర్ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఇందుకోసం బీబర్ ముంబై చేరుకున్నారు. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో పాప్ క్వీన్ రిహన్నా ప్రదర్శన ఇచ్చింది.
జూలై 12న పెళ్లి
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వారు వివాహం చేసుకోబోతున్నారు. పెళ్లికి అతిథులందరినీ ఆహ్వానించారు. జూలై 12న ‘శుభ్ వివాహ్’, 13న ‘శుభ్ ఆశీర్వాద్’, 14న ‘మంగళ్ ఉత్సవ్’ జరగనుంది. గతంలో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.