Viral News: ప్రముఖ వ్యాపారవేత్త ఆనందర్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో హంగరీలో ఉన్న మ్యూజికల్ రోడ్డు గురించి పరిచయం చేశారు. వినూత్న ఆలోచన గురించి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ఆలోచన చాలా అద్భుతంగా ఉందని.. మన జాతీయ రహదారులు కూడా ఇలా సంగీతం వినిపించేలా నితిన్ గడ్కరీ చర్యలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. రహదారిపై ఒక వాహనం తగిన వేగంతో ప్రయాణిస్తుంటే... ఏ పాట, ఏ సంగీతం వినిపించాలనేది ఎంచుకోవడమే ఇక్కడ కష్టమైన విషయం అంటూ రాసుకొచ్చారు. అయితే ఇది రాష్ట్రాలను బట్టి మారుతుండొచ్చని తాను అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోలో ఒక కారు సరైన వేగంతో వెళ్తుండగా.. అద్భుతంగా ఉన్న సంగీతం ప్లే అవుతోంది. ఈ వీడియోపై నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్ల చేస్తున్నారు. తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. పలువురు సరదాగా పోస్టులు చేస్తుండగా.. ఈ పాటల కంటే మెరుగైన రోడ్లు, పాదచారుల కోసం తగిన సదుపాయాలకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని మరికొందరు చెబుతున్నారు.