UP Police Action Amroha Reel: యూపీలోని అమరోహా జిల్లాలో చాముండా దేవి ఆలయం వేదికగా ఒకే యువకుడిని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైన వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ముగ్గురు యువతులు ఒకే యువకుడి మెడలో దండలు వేయడం, గుడి ఆవరణలో తాళి కట్టే ఘట్టాలు, సత్యనారాయణ స్వామి వ్రతం తరహా పూజలు చేయడం ఉన్న వీడియోలు ఆన్‌లైన్‌లో తుఫాను సృష్టించాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒకే యువకుడు పెళ్ళాడాడు అనే క్యాప్షన్లతో ఈ వార్త క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విస్మయానికి గురయ్యారు.
అయితే, సోషల్ మీడియాలో ప్రచారమైనంత మాత్రాన ఇది నిజమైన వివాహం అనుకుంటే పొరపాటే! వివరాల్లోకి వెళ్తే అసలు నిజం వేరేలా ఉంది. అమరోహ ప్రాంతానికి చెందిన ఆదర్శ్ అనే యువకుడితో పాటు ఆయన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు, మరో బంధువుల అమ్మాయి కలిసి నిత్యం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా రీల్స్ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో వ్యూస్ , ఫాలోవర్లను పెంచుకోవడమే ధ్యేయంగా ప్లాన్ చేసిన ఒక నాటకీయ డ్రామా మాత్రమే ఇదని పోలీసులు పరిశీలనలో తేలింది.
సాధారణంగా హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వాం చట్టరీత్యా నేరం మాత్రమే కాకుండా, పవిత్రమైన దేవాలయ ఆవరణలో కేవలం వ్యూస్ కోసం ఇలాంటి విన్యాసాలు చేయడంపై స్థానిక భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చాముండా దేవి ఆలయ కమిటీ ప్రతినిధులు సైతం ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. పవిత్రమైన గుడి పరిసరాలను కలుషితం చేస్తూ, వ్యవస్థను హేళన చేసేలా రీల్స్ చిత్రీకరించిన సదరు యువకుడు , ఆ ముగ్గురు యువతులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు.
పోలీసు యంత్రాంగం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఇది చట్టబద్ధంగా జరిగిన పెళ్లి కాదని, కేవలం సోషల్ మీడియా హైప్ , ఫాలోవర్లను ఆకర్షించేందుకు ఆడిన స్క్రిప్టెడ్ నాటకం అని సదరు యువతులు అంగీకరించారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నందుకు, సమాజంలో తప్పుడు సందేశాన్ని వ్యాప్తి చేసినందుకు సదరు క్రియేటర్లపై చట్టపరమైన విచారణ నమోదు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో చిల్లర ప్రచారాల కోసం, కొన్ని లైక్స్, లైవ్ వ్యూస్ కోసం ఏ స్థాయికైనా దిగజారే సంస్కృతి ఏ రేంజ్‌కు చేరిందో చెప్పడానికి అమరోహా సంఘటన ఒక ఉదాహరణగా నిలిచింది.
