Amit Shah On Maoists Encounter: మార్చి 31, 2026 లోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని మోడీ ప్రభుత్వం సంకల్పించిందని హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. చత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ ఎన్ కౌంటర్ పై అమిత్ షా ట్వీట్ చేశారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఇది ఓ మైలురాయి విజయమన్నారు.  ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో, మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి, వారిలో సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు ,  నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నారు. నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రధాన పురోగతికి మన ధైర్యవంతులైన భద్రతా దళాలు, ఏజెన్సీలను అభినందిస్తున్నానని ప్రకటించారు.  ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత, 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశారని ,  84 మంది నక్సలైట్లు లొంగిపోయారని  తెలిపారు. 

అమిత్ షా ట్వీట్ పై ప్రధాని మోదీ స్పందించారు., నక్సలిజం అంతం విషయంలో ముందడుగు వేస్తున్నందుకు అభినందించారు.  

చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతం మావోయిస్టులకు పెట్టని  కోటలా ఉంది. అలాంటి చోట బలగాలు నక్సలైట్ల వేట కొనాగిస్తున్నాయి.  నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ అడవుల్లో నక్సలైట్లు కనిపిస్తే కాల్చి పరేస్తున్నారు.   జవాన్లు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. తాజాగా బీజాపూర్, నారాయ‌ణ‌పూర్‌, దంతెవాడ డీఆర్‌జీ బ‌ల‌గాలు క‌లిసి కూంబింగ్ నిర్వ‌హించాయి. ఈ క్రమంలో నారాయ‌ణ‌పూర్ జిల్లా మాధ్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలపై మావోయిస్టులు జరిపారు. వెంటనే స్పందించిన డీఆర్జీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. 

మృతులలో మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశ‌వ‌రావు అలియాస్ బ‌స‌వ‌రాజు(66) ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై రెండు దశబ్దాల కిందట అలిపిరిలో జరిగిన బాంబుదాడిలో ప్రధాన సూత్రధారిగా నంబాల ఉన్నారు. ఆయన మీద రూ. 1.5 కోట్ల భారీ రివార్డు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా పలుమార్లు చాకచక్యంగా తప్పించుకున్న నంబాల తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఐఈడీల వినియోగంలోనూ ఆయ‌న ఎక్స్‌పర్ట్. కాగా, ఇటీవల జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో అలిపిరి దాడుల సూత్రధారి, మావోయిస్టు చలపతి చనిపోయాడు. 

మార్చి 2026 నాటికి దేశంలో నక్సలైట్లు, మావోయిస్టులు లేకుండా చేయాలన్నది తమ లక్ష్యమని కేంద్రం చెబుతోంది. మావోయిస్టుల ఏరివేత విషయంలో బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు పేర్కొన్నారు. మావోయిస్టులు చర్చల కోసం లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది.  మళ్లీ ఉపేక్షించే అవకాశం లేదని నక్సలిజాన్ని అంతం చేస్తామని  పట్టుదలగా చెబుతోంది.