అనంతపురం: అనంతపురం జిల్లా జడ్పీ కార్యాలయంలో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటో పెట్టడం వివాదానికి దారి తీసింది. వైసీపీ అధికారం కోల్పోయి ఏడాది అవుతున్నా, జడ్పీ ఆఫీసులో ఇంకా జగన్ ఫొటో ఎలా పెడతారని కూటమి నేతలు నిలదీశారు. 

గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇంకా మాజీ సీఎం ఫొటోలా..

కూటమి అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా కూడా ఇప్పటికీ ఏపీలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫొటోలు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అనంతపురం జిల్లా జడ్పీ కార్యాలయంలో నేడు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కూటమి ఎమ్మెల్యేలు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అని సురేంద్రబాబు హాజరయ్యారు. సమావేశానికి హాజరయ్యేందుకు జడ్పీ కార్యాలయంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు నేరుగా జెడ్పి చైర్మన్ ఛాంబర్ లోకి వెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబు ఫోటోకు బదులుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం చూసి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జడ్జీ సీఈవోపై ఎమ్మెల్యేల ఆగ్రహం

వెంటనే జిల్లా జడ్పీ సీఈవో రామచంద్రా రెడ్డిని పిలిపించి ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు ఫోటో కాకుండా ఇప్పటికీ మాజీ సీఎం జగన్ ఫోటో పెట్టడం ఏంటని జడ్పీ సీఈఓపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జగన్ చిత్రపటాన్ని తీసేసి ముఖ్యమంత్రి ఫోటో పెట్టాల్సిందిగా ఎమ్మెల్యేలు ఆదేశించారు. అయితే ఇక్కడ జిల్లా జడ్పీ చైర్పర్సన్ వైసీపీ పార్టీకి చెందిన బోయ గిరిజమ్మ కావడం విశేషం. వైయస్ఆర్సీపీ పార్టీకి చెందిన చైర్మన్ బోయ గిరిజమ్మ చాంబర్లో తమ పార్టీ అధినేత జగన్ ఫోటోను పెట్టారు. ఇదే విషయంపై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తమ పార్టీ అధినేత అయితే తమ ఇంట్లోనూ వారి పార్టీ కార్యాలయాలను లేకపోతే వాళ్ళ ఇంట్లో పూజ గదిలో ఫోటోనే పెట్టుకోమనండి.. ప్రభుత్వ కార్యాలయంలో పెట్టడం ఏంటని సీఈఓ రామచంద్రారెడ్డి తో వాగ్వాదానికి దిగారు. వెంటనే స్పందించిన జడ్పీ సీఈవో కార్యాలయ సిబ్బంది ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోని జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని తొలగించి వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటోను జడ్పీ చైర్పర్సన్ ఛాంబర్ లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారి ఏడాది కావస్తున్నప్పటికీ ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు గత ప్రభుత్వంపై స్వామి భక్తి చాటుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.