Gujarat Election 2022:
గుజరాత్ ఎన్నికల ప్రచారం..
గుజరాత్ ఎన్నికల్లో సడెన్ ఎంట్రీ ఇచ్చింది AIMIM పార్టీ. ఇన్నాళ్లూ ప్రచారం ఊసే ఎత్తని ఆ పార్టీ ఇప్పుడు స్పీడ్ పెంచింది. స్వయంగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేస్తున్నారు. వచ్చీ రావటంతోనే ఓ అస్త్రం ప్రయోగించారు. గుజరాత్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే "గోవధ శాలలను" పెంచుతామని సంచలన ప్రకటన చేశారు. అంతే కాదు. ఈ ఎన్నికల్లో "M" ఫార్ములాను అనుసరిస్తోంది ఆ పార్టీ. ముస్లిం ఓట్లను
టార్గెట్ చేయడం, ముస్లిం అభ్యర్థినే నిలబెట్టడం, వాటితో పాటు ముస్లింల సమస్యలను ప్రస్తావించటం...ఈ వ్యూహంతో ముందుకెళ్లాలని చూస్తోంది. ఇదే "M"ఫార్ములాతో ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది AIMIM.ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటెజీతో బరిలోకి దిగుతోంది. ఈ సారి గోవధశాలలు పెంచుతామంటూ ప్రకటించడం అక్కడి రాజకీయ వేడిని పెంచింది. "ప్రస్తుతానికి గుజరాత్‌లో 36 కబేళాలున్నాయి. వీటిలో 25 కబేళాల్ని మూసివేశారు. ప్రస్తుతానికి నాలుగు మాత్రమే నడుస్తున్నాయి. ఈ సమస్య పరిష్కరిస్తానని మాటిస్తున్నాను" అని వెల్లడించారు అసదుద్దీన్ ఒవైసీ.
కబేళాలు బంద్..
గుజరాత్‌లో గోవధను నియంత్రించటమే కాకుండా, కబేళాలను మూసివేసింది ప్రభుత్వం. ఫలితంగా...మాంసం వ్యాపారులకు ఉపాధి లేకుండా పోయింది. మీర్జాపూర్‌లో వారంలో 212 పశువులను వధించేందుకు అనుమతి ఉంది. కానీ..ఈ వ్యాపారులు మాత్రం ఈ సంఖ్యను 400కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మాంసానికి డిమాండ్ పెరుగుతున్న కొద్దీ...ఈ సమస్య పెరుగుతోందని అంటున్నారు వ్యాపారులు. "మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం వాటిని పట్టించుకోవటం లేదు. AIMIM అభ్యర్థి గెలిస్తే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు" అని ఓ వ్యాపారి అన్నారు.
కర్ణాటకలోనూ..
అటు కర్ణాటకలోనూ బీజేపీ ప్రభుత్వం గోవధపై ఆంక్షలు విధించింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే-BBMP పరిధిలో గోవధను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్‌ను నియమించింది ప్రభుత్వం. గోవధను నిషేధించేందుకు 'ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కాటిల్ బిల్-2020'ను కర్ణాటక అసెంబ్లీ 2020లోనే ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం.. రాష్ట్రంలో గోవధపై పూర్తిగా నిషేధం. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా గోవుల అక్రమ రవాణా, హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ చట్టానికి లోబడి ఉండాలని ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. పశుసంవర్థక శాఖ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి గోవుల్ని తరలించకుండా చూడాలని చెప్పింది. బక్రీద్ రోజున దూడలు, ఆవులు, ఒంటెల్ని బలి ఇచ్చే సంప్రదాయం ఉంది.
ఈ వధను సహించేది లేదని, కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఎవరైనా ఈ ఆదేశాలను లెక్క చేయకుండా గోవులను బలి ఇస్తే కఠిన కేసులు నమోదు చేస్తామని వెల్లడించింది. AIMIM ఇందుకు భిన్నంగా కబేళాల సంఖ్యను పెంచుతామంటూ కామెంట్ చేయడంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.