Citizenship Amendment Act: AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ CAA పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది కేవలం ముస్లింలను అణిచివేసేందుకు తీసుకొచ్చిన చట్టం అని మండి పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. వెంటనే ఈ చట్టం అమలుని నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. National Register of Citizens (NRC)కి పౌరసత్వ సవరణ చట్టానికి దగ్గరి పోలిక కనిపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో కీలక విషయాలు ప్రస్తావించారు. కేవలం మైనార్టీ వర్గాలపై వివక్ష చూపించాలన్న కుట్రతోనే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. 


"కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా CAA చట్టంతో ఎవరికీ పౌరసత్వం కల్పించరు. ఇదంతా కేవలం మైనార్టీ వర్గాలను ఇబ్బంది పెట్టేందుకు తీసుకొచ్చిన చట్టం. కావాలనే వాళ్లని లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపించేందుకే ఇదంతా చేస్తున్నారు. వాళ్ల పౌరసత్వాన్ని సవాల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు పౌరసత్వానికి సంబంధించి దాఖలయ్యే అప్లికషన్‌లను పక్కన పెట్టాలని కోరుకుంటున్నాను"


- అసదుద్దీన్ ఒవైసీ, AIMIM చీఫ్ 






ఇప్పటికే సుప్రీంకోర్టులో CAAకి వ్యతిరేకంగా పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటన్నింటిపైనా సర్వోన్నత న్యాయస్థానం మార్చి 19వ తేదీన విచారణ చేపట్టనుంది. మార్చి 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. ఇకపై కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్‌లో హింసకు గురై భారత్‌కి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించనుంది. ముస్లిమేతరులకు మాత్రమే ఇది వర్తించనుంది. 2014 డిసెంబర్ 31వ తేదీ కన్నా ముందు భారత్‌కి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పిస్తామని కేంద్రం వివరించింది. ఈ నిర్ణయంపై ఇప్పటికే ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా తీవ్రంగా మండి పడుతున్నారు. 


"ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ చేసే జిమ్మిక్కు ఇదే. ఎన్నికలు రాగానే CAA నిబంధనల గురించి మాట్లాడుతుంది. ముందు నుంచి మేం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఈ చట్టం అమలు చేయాలనుకోవడం గాడ్సే తరహా ఆలోచనా విధానం. కేవలం దేశంలో ముస్లింల సంఖ్య తగ్గించాలని జరుగుతున్న కుట్ర. పౌరసత్వం అనేది మతం ఆధారంగా ఇవ్వాల్సింది కాదు. ఐదేళ్లుగా ఈ చట్టం ఎందుకు అమలు చేయలేదు..? ఇప్పుడే ఎందుకు చేస్తున్నారో కేంద్రం వివరణ ఇవ్వాలి. NPR,NRC లాగే సీఏఏ కూడా ముస్లింలను అణిచివేసేందుకు తీసుకొచ్చిందే. దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు"


- అసదుద్దీన్ ఒవైసీ, AIMIM చీఫ్ 


Also Read: Lok Sabha Elections 2024: మార్చి 19వ తేదీన కాంగ్రెస్ మేనిఫెస్టో! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ