Boeing Whistle Blower Alert:  బోయింగ్ 787 Boeing 787 Dreamliner  ముక్కలవుతుంది అని ఆ సంస్థలో పనిచేసిన ఉద్యోగి, ఓ విజిల్ బ్లోయర్ హెచ్చరించాడు.  ఇది జరిగిన ఏడాదికి అహ్మదాబాద్‌లో 787 డ్రీమ్‌లైనర్ క్రాష్ అయింది. 240మందికి పైగా ఈ భయంకరమైన ప్రమాదంలో చిక్కుకున్నారు. 

జూన్ 12న అహ్మదాబాద్‌లో  అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది.  ఎయిర్ ఇండియాకు చెందిన  AI-171 అనే బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ లండన్‌కు వెళుతోంది.  గురువారం మధ్యాహ్నం  సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన వెంటనే  ౩౦ సెకండ్లలోపే అది కుప్పకూలిపోయింది.  మధ్యాహ్నం 1:39 గంటలకు IST (08:09 UTC) సమయంలో రన్‌వే  నుండి పైకి లేచిన వెంటనే, విమానాశ్రయం వెలుపల మంటల్లోకి ఓ బిల్డింగ్‌పై కూలిపోయి మంటల్లో  చిక్కుకుంది.

విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు, వీరిలో ఇద్దరు పైలట్‌లు మరియు 10 మంది సిబ్బంది ఉన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం, ఈ విమానానికి కెప్టెన్ సుమీత్ సభర్వాల్, కో-పైలట్ క్లైవ్ కుందర్ నేతృత్వం వహించారు,  కెప్టెన్‌కు 8200 గంటల ఫ్లైయింగ్ అనుభవం ఉంది.  కో పైలట్ కూడా  1,100 గంటలు విమానం నడిపారు. అంతటి అనుభవం ఉన్న పైలట్లు.. విమానంలో తలెత్తిన సమస్యతో అత్యవసర కోడ్  'మేడే' MAY DAY అని ATC కి చెప్పిన వెంటనే విమానం కూలిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి వాళ్లకి తిరిగి సమాధానం అందే  లోపలే విమానం పేలిపోయింది. 

ప్రపంచంలోనే ఇది మొదటి 787 డ్రీమ్‌లైనర్ ప్రమాదం... డ్రీమ్ లైనర్ చాలా ఆధునికమైన సురక్షితమైన వ్యవస్థలున్న ఎయిర్‌క్రాఫ్ట్ అని ఏవియేషన్ నిపుణులు చెబుతారు. కానీ  బోయింగ్ 787లో చాలా లోపభూయిష్టమని అది ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదకరమని ఓ విజిల్ బ్లోయర్ చేసిన హెచ్చరిక.. ఇప్పుడు మనకు వాస్తవ రూపంలో కనిపిస్తోంది.  

విమానం ముక్కలవ్వొచ్చు.. వందల మంది పోతారు.. విజిల్ బ్లోయర్ హెచ్చరిక..

అహ్మదాబాద్ ప్రమాదానికి ఒక సంవత్సరం ముందు, బోయింగ్ 787 విమానాలలో నిర్మాణ లోపాల గురించి అమెరికాలో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఏప్రిల్ 2024లో, బోయింగ్ క్వాలిటీ ఇంజనీర్ అయిన సామ్ సలేహ్‌పోర్, డ్రీమ్‌లైనర్‌లో ఉత్పత్తిలో, నాణ్యతలో లోపాల కారణంగా విమానం పదేపదే ప్రయాణించిన తర్వాత "ముక్కలైపోవచ్చు" అని US సెనేట్ ఉపసంఘం ముందు వాంగ్మూలం ఇచ్చారు.

 ఆ ఇంజనీర్ చెప్పిన విధంగా లేదా చెప్పిన రీతిలో ప్రమాదం జరిగిందో లేదో తెలీదు కానీ..  మొట్టమొదటి సారి జరిగిన 787 ప్రమాదంతో ఈ వాదనకు మాత్రం బలం చేకూరుతోంది.     “ఒకవేళ ఈ సమస్యలను పరిష్కరించకపోతే, ఇది వాణిజ్య విమానం వినాశకరమైన వైఫల్యానికి దారి తీస్తుంది, దీనివల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.”  అని  తన వాంగ్మూలంలో, సలేహ్‌పోర్ హెచ్చరించారు

సలేహ్‌పూర్  చెప్పిన దాని ప్రకారం, 787 ఫ్యూజ్‌లేజ్ ( విమానం మెయిన్ బాడీ)  ముఖ్యమైన భాగాల మధ్య ఖాళీలు ఉన్నాయి. - ఇప్పటికే సర్వీసులో ఉన్న 1,000 కంటే ఎక్కువ విమానాల్లో ఈ లోపం ఉంది.  కాలం గడిచే కొద్దీ  రెండు ప్రధాన విమాన జాయింట్లలో వచ్చే సమస్య కారణంగా..  "సమయానికి ముందే వైఫల్యానికి" కారణమయ్యే అవకాశం ఉంది.  ఈ విషయాన్ని బోయింగ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లానప్పటికీ పట్టించుకోక పోగా.. తనపై కక్ష సాధింపు మొదలుపెట్టారని సలేపోర్ అన్నారు.  భద్రతాపరమైన సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నించినప్పుడు, తనను బెదిరించారని మరియు భయపెట్టారని కూడా ఆయన ఆరోపించారు. “నిజం చెప్పాలంటే, నోరు మూసుకోమని నన్ను హెచ్చరించారు” అని ఆయన అన్నారు.

సేప్టీ కల్చర్ లేదు.

బోయింగ్ పై వచ్చిన ఈ  ఆరోపణలు  అక్కడ అంతర్గత  విధానాలు భద్రతా ప్రోటోకాల్‌లపై  తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. సలేహ్‌పూర్ మాట్లాడుతూ, కంపెనీలో “ Safety Culture"  లేదు అన్నారు  విజిల్‌బ్లోయర్‌లను సాధారణంగా “విస్మరించడం, అణచివేయడం, బెదిరించడం, పక్కన పెట్టడం లేదా అధ్వాన్నంగా చూడటం జరుగుతుంది” అని అన్నారు.

మరొక నిపుణుడు, ఎడ్ పియర్సన్ - మాజీ బోయింగ్ ఇంజనీర్,  ప్రస్తుత ఏవియేషన్ సేఫ్టీ ఫౌండేషన్ అధిపతి   కూడా బోయింగ్ పై విమర్శలు చేశాడు. - ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఒక ప్రత్యేకమైన అలాస్కా ఎయిర్‌లైన్స్ క్యాబిన్ పేలుడు ఘటన తరువాత అసంపూర్ణ రికార్డులతో సంబంధం ఉన్న “నేరపూరిత కవర్-అప్”కు కంపెనీ పాల్పడిందని ఆరోపించారు. “రికార్డులు ఉన్నాయి ...  బోయింగ్ కార్పొరేట్ నాయకులకు కూడా తెలుసు” అని పియర్సన్ సెనేట్‌తో మాట్లాడుతూ, తాను వ్యక్తిగతంగా సంబంధిత పత్రాలను FBIకి అందజేసినట్లు పేర్కొన్నారు.

బోయింగ్  ఈ ఆరోపణలను ఖండించింది, 787, 777తో సహా దాని విమానాలు సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది, అయితే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆరోపణలపై చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. దీనికి ప్రతిస్పందనగా, బోయింగ్ 2020 నుండి “భద్రతా సంస్కృతిని పెంపొందించడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంది”  అని తెలిపింది.

బోయింగ్‌పై తగ్గుతున్న నమ్మకం

బోయింగ్ CEO డేవిడ్ కాల్‌హౌన్‌ను వచ్చే వారం సెనేట్ ఉపసంఘం ముందు హాజరు కావాలని పిలిచారు. పెరుగుతున్న ఈ వివాదం మధ్య, కాల్‌హౌన్,  బోర్డు ఛైర్మన్ లారీ కెల్నర్ ఇద్దరూ రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.

బోయింగ్ హామీలు ఇచ్చినప్పటికీ, సలేహ్‌పూర్ అన్ని 787 విమానాలను తక్షణ తనిఖీ కోసం గ్రౌండ్ చేయాలని కోరారు. “బోయింగ్ మెరుగ్గా పనిచేస్తుందని ... బోయింగ్‌పై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించవచ్చని నేను నమ్ముతున్నాను” అని ఆయన అన్నారు. “ఈ కమిటీ బోయింగ్‌ను జవాబుదారీగా ఉంచుతుందని భద్రత కంటే లాభానికే  ప్రాధాన్యతనిచ్చే వ్యాపార సంస్కృతిని ముగించాలని కోరుకుంటున్నాను.” అని చెప్పారు. 

అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదంతో, ఈ భద్రతాపరమైన ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి - ముఖ్యంగా బోయింగ్ కు చెందిన 787 వంటి  వైడ్-బాడీ విమానాలు, దూర ప్రయాణాలకు ఉపయోగించే విమానాలపై ఆందోళన ఉంది.