Ahmedabad Plane Crash Air India Pilot Mayday Call: అహ్మదాబాద్ విమానం గాల్లోకి లేచిన వెంటనే.. పైలట్.. మేడే అనే సంకేతాన్ని ఏటీసీకి పంపించారు. పైలట్ ఈ సంకేతాన్ని పంపించారంటే.. విమానం లేదా దానిలోని ప్రయాణీకులకు ప్రాణాంతక పరిస్థితి ఏర్పడిందని అర్థం చేసుకోవాలి.
విమాన ప్రయాణాల్లో పైలట్లు "మే డే" (MAYDAY) అని చెప్పడం అంటే విమానం తీవ్రమైన ప్రమాదంలో ఉందని లేదా అత్యవసర స్థితిని సూచించే అంతర్జాతీయ రేడియో దిస్ట్రెస్ సిగ్నల్. ఈ పదం ఫ్రెంచ్ పదం "m'aider" (మీ ఆయిదర్) నుండి వచ్చింది. దీని అర్థం "నాకు సహాయం చేయండి" అని విమానయాన నిపుణులు చెబుతున్నారు.
మే డే కాల్ అంటే విమానం లేదా దానిలోని ప్రయాణీకులకు ప్రాణాంతక పరిస్థితి ఏర్పడిందని సూచించడమని చెబుతున్నారు. ఇంజన్ వైఫల్యం, అగ్ని ప్రమాదం, లేదా నియంత్రణ కోల్పోవడం వంటివి జరిగినప్పుడు పైలట్లు మేడే కాల్ ఇస్తారు.
ఈ కాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది, వెంటనే సహాయం అందించేందుకు ఇతర సందేశాలను పక్కనపెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
సాధారణంగా, పైలట్ "MAYDAY, MAYDAY, MAYDAY" అని మూడు సార్లు చెబుతాడు. ఆ తర్వాత విమానం కాల్ సైన్, స్థానం, సమస్య స్వభావం, అవసరమైన సహాయాన్ని వివరిస్తాడు. కానీ అహ్మదాబాద్ ప్రమాదంలో అలాంటి అవకాశం కూడా పైలట్ కు లభించలేదని తెలుస్తోంది.
అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 సందర్భంలో, పైలట్లు టేకాఫ్ తర్వాత వెంటనే మే డే కాల్ ఇచ్చారు.ఇది విమానం తీవ్ర సాంకేతిక సమస్యలో ఉందని సూచిస్తుంది. అయితే, ఆ తర్వాత ATCకు స్పందన రాలేదు. అంటే అత్యంత తీవ్రమైన సమస్యతో ఫ్లైట్ కుప్పకూలిపోయిందని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.