Kejriwal Arrest: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశమని..చట్టం గురించి వేరే దేశాలు ఉపదేశాలు చెబుతుంటే విని నేర్చుకునే స్థితిలో లేదని ఘాటుగా స్పందించారు. ఇప్పటికే అమెరికా, జర్మనీ, ఐక్యరాజ్య సమితి కేజ్రీవాల్ అరెస్ట్‌ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ధన్‌కర్ కూడా ఆ కామెంట్స్‌పై మండి పడ్డారు. 


"భారత్‌ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ పటిష్ఠమైన న్యాయ వ్యవస్థ ఉంది. ఇది ఎవరో ఓ వ్యక్తి కోసమో లేదంటే ఓ సంస్థ కోసమో మారిపోదు. చట్టాల గురించి భారత్ మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన పని లేదు. చట్టం ముందు అందరూ సమానమే. ఆ సిద్ధాంతానికి భారత్ కట్టుబడి ఉంది. కొంత మంది చట్టాలకు అతీతంగా ఉండాలని అనుకున్నా అది కుదరదు"


- జగ్‌దీప్ ధన్‌కర్, ఉపరాష్ట్రపతి 


కేజ్రీవాల్ అరెస్ట్‌ని వ్యతిరేకిస్తూ I.N.D.I.A కూటమి నేతలు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం వద్ద భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. దీనిపైనా జగ్‌దీప్ ధన్‌కర్ విమర్శలు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఆ నేతలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పడమేంటని ప్రశ్నించారు.


"చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే కొంత మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తామని చెబుతున్నారు. ఇంకొందరు వాదోపవాదాలు చేస్తున్నారు. మానవ హక్కుల్ని ఇలా ఉపయోగించుకుంటారా..? భారత న్యాయవ్యవస్థ చాలా పటిష్ఠమైంది. అది స్వతంత్రంగా పని చేస్తుంది. ఓ చట్టం చెప్పినట్టు అధికారులు చర్యలు తీసుకుంటే ఇలా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడంలో అర్థం ఏముంది.."


- జగ్‌దీప్ ధన్‌కర్, ఉప రాష్ట్రపతి 


Indian Institute of Public Administration 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ధన్‌కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు విక్టిమ్ కార్డ్‌ పట్టుకుని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. అవినీతి ఎప్పటికైనా ఇలా జైలు పాలు చేస్తుందని తేల్చి చెప్పారు. అలాంటి వాళ్లను చట్టం ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు.