Pawan Kalyan Elections Campaign: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార భేరీ నేటి నుంచి ప్రారంభమవుతుంది. మొదటి విడత ప్రచారం ఏప్రిల్‌ 12 వరకు సాగనుంది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలోనే ప్రచారం చేయనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌్లో ఈ మధ్యాహ్నం 12.30కి గొల్లప్రోలు... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం చేరుకుంటారు. 


ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పిఠాపురం టికెట్ ఆశించిన ఎస్‌వీఎన్‌ఎస్ వర్మతో పవన్ కల్యాణ్‌ సమావేశం అవుతారు. ఆయనతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి పాదగయ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ అష్టదశ పీఠంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత శ్రీపాద వల్లభుని ఆలయంలో కూడా పూజలు చేస్తారు. 


సాయంత్రం నాలుగున్నరకు పవన్ ప్రచారం మొదలవుతుంది. చేబ్రోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలోనే ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు అంటే రెండోతేదీ వరకు పవన్ ప్రచారం సాగనుంది. ఈ ప్రచారంలో పిఠాపురంలోని ప్రజలతోపాటు స్థానికంగా ఉండే కూటమి నాయకులతో కూడా పవన్ కల్యాణ సమావేశమవుతారు. వారితోపాటు మేథావులు ఇతర సామాజిక వర్గాల వారితో మాట్లాడనున్నారు. 


ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని ఉగాది నాటికి మళ్లీ పిఠాపురంలో ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఉగాది రోజు పిఠాపురంలోనే కార్యకర్తలతో నేతలతో గడపనున్నారు. అక్కడే పంచాగశ్రవణంలో పాల్గొంటారు. 


మూడో తేదీన పిఠాపురంలో ప్రచారం ముంగించుకొని హెలికాప్టర్‌లో తెనాలి చేరుకుంటారు. అక్కడ పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్‌ తరఫున ప్రచారం చేయనున్నారు. ఆ నియోజకవర్గంలో రోడ్‌షోలతోపాటు బహిరంగ సభ కూడా ఉంటుంది. తెనాలి ప్రచారం ముగిసిన తర్వాత నాల్గో తేదీ నుంచి ఉత్తారంధ్రలో పవన్ పర్యటించనున్నారు. 


నాల్గో తేదీన నెల్లిమర్ల, ఐదో తేదీన అనకాపల్లి, ఆరున యలమంచలి, 7న పెందుర్తిలో జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. అక్కడ కూడా రోడ్‌షోలు, బహిరంగ సభల్లో ప్రసగించనున్నారు. వారి విజయానికి కూటమి నేతలు సహకరించేలా వారితో మాట్లాడనున్నారు. అన్ని పార్టీల నేతలు కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లేలా సమన్వయం చేసుకోవాలని సూచించనున్నారు. 


ఏదో తేదీన ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని కాకినాడ చేరుకుంటారు పవన్. కోస్తా జిల్లాల్లో ప్రచారం 8 నుంచి ప్రారంభంకానుంది. కాకినాడలో 8న ప్రచారం చేస్తారు. 9వ తేదీన ఉగాది రోజున పిఠాపురంలో ఉంటారు. తర్వాత రోజు పదో తేదీ నుంచి  కోనసీమ జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది పవన్ వారాహి విజయభేరి యాత్ర. 11న పి గన్నవరం నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. 12న తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పవన్ ప్రచారంతో మొదటి విడత ప్రచారం ముగుస్తుంది.