Srikakulam News: తెలుగుదేశం (TDP) కంచుకోట...ఇచ్ఛాపురం నియోజకవర్గం(Ichchapuram Assembly Constituency) పై వైసిపి (YSRCP) ప్రత్యేక ఫోకస్ పెట్టింది.  టిడిపి కంచుకోటను వైసిపి బద్దలు కొట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అయితే అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షటీడీపీ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం...పది నియోజకవర్గాల్లో ఒకటి. ఒడిశా రాష్ట్రానికి ఆనుకొని ఉంటుంది. ఈ నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి. పలాస అసెంబ్లీలోని కొన్ని నియెజకవర్గాలతో కలిపి వీటిని ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు. ఉద్దానం అంటే ఉద్యానవనం అని. నేడు ఉద్దానం ప్రాంతాన్ని అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. కిడ్నీ వ్యాధులు, ఉపాధి కరవు, సాగునీటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. 


ఎన్నికల వేళ పార్టీల హామీలు
ప్రతి ఏటా రాజకీయ పార్టీలు ఇచ్చాపురం ప్రజలపై పలు హామీలు గుప్పిస్తున్నాయి. తాము  అధికారంలోకి వస్తే...సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్‌ను రద్దు చేసిన ప్రాంతంలో పుడ్ ప్రోసెస్ యూనిట్లు పెడతామని చెబుతున్నాయి. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని, మరో కోనసీమగా పిలుచుకునే ఉద్ధానం కొబ్బరి రైతులను ఆదుకుంటామని చెప్పాయి. బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడం, ఇచ్ఛాపురం మున్సిపాలిలో దశాబ్దాలుగా పరిష్కారం కాని తాగునీరు, డంపింగ్ యార్డు సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చాయి. ఉద్దానం కిడ్ని రోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, బీల చిత్తడి నేలకు హాని కలిగించకుండా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామన్న హామీ నేటికి నెరవేరలేదు. 


కిడ్నీ సమస్యలపై ఫోకస్
దశాబ్దాలుగా ఉద్ధానం ప్రాంతాన్ని పీడిస్తున్న కిడ్నీ సమస్య నేటికీ అంతు చిక్కని మర్మలానే ఉంది. కారణాలు చెప్పలేకపోతున్న ప్రభుత్వాలు తాత్కాలిక చర్యలతో ఓట్లు వేట కొనసాగిస్తున్నాయి. ఈ మహమ్మారి బారిన పడి కుటుంబాలకు కుటుంబాలనే రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు లేని కుటుంబాలే ఉన్నత కుటుంబాలుగా చెప్పుకుంటారు. ఎంతటి వారినైనా ఈ జబ్బు అప్పులు పాలు చేస్తుందని చెప్పుకుంటారు. 


కొన్ని చేసినా చేయాల్సింది చాలానే ఉంది


ఇచ్చాపురం నియోజకవర్గం ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకున్న ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్ పాస్, పదివేల పెన్షన్ సదుపాయం కల్పించింది. డయాలసిస్‌తోపాటు వైద్య పరీక్షలు, చికిత్స, మందులు కూడా ఉచితంగా అందిస్తోంది. కిడ్నివ్యాధులపై అధ్యయనం కోసం 200 పడకల రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇవి అందరికీ అందడం లేదని ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం సరిగా లేని ఇచ్చాపురంలో వ్యాధిగ్రస్తులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. 


ఇచ్చాపురం నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన,  కవిటి మండలంలో కోకోనట్ పార్క్, పురుషోత్తపురంలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించకపోవడం వైసీపీకి మైనస్‌గా మారనుంది. వైసీపీలో ఉన్న గ్రూపులు గోల బెందాళం అశోక్‌కు కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ... నిర్లక్ష్యంగా ఉంటే మొదటకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదని టీడీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. 


బెందాళం అశోక్ హ్యాట్రిక్ కొడతారా ?
సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్‌కు సౌమ్యుడిగా ప్రజల్లో పేరుంది. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండటం...సొంత సామాజికవర్గం కళింగుల మద్దతు ...మత్స్యకార గ్రామాల్లో మంచి పట్టు ఉంది. బలమైన టిడిపి క్యాడర్ వెన్నుదన్ను ఉండటం అశోక్‌కు ప్లస్‌గా మారింది. తాగునీటి సమస్య పరిస్కారం కాకపోవడం, కిడ్నివ్యాధులు,  బెంతు ఒరియాలను ఎస్టీల‌్లో కలపాలంటూ చేస్తున్న పోరాటం మైనస్‌గా మారనుంది. తిత్లీ తుఫాను బాధితులకు పరిహారం పూర్తిగా చెల్లించకపోవడం...ఇచ్చాపురం పట్టణంలో మినీ స్టేడియం శంకుస్థాపన చేసి వదిలేయడం అశోక్‌కు మైనస్‌.


వలసల పరిష్కారమేది? 


శ్రీకాకుళం జిల్లా వలసల భారీగా ఉంటే... జిల్లాలోనే ఇచ్చాపురం ప్రథమ స్థానంలో ఉంటుంది. డిగ్రీ చదివిన తర్వాత స్థానికంగా పని చేసేందుకు ఎలాంటి సదుపాయాలు లేవు. స్కూళ్లు, కాలేజీల్లో చెప్పుకోవడం మినహా చేసేందుకు ఎలాంటి పనులు లభించవు. అందుకే ఇక్కడ నుంచి అటు భువనేశ్వర్‌, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీకి భారీగా వలసలు ఉంటున్నాయి. కొందరు దుబాయ్ లాంటి ప్రాంతాలకి కూడా తరలిపోతున్నారు. చాలా గ్రామాల్లో 50 ఏళ్లకు పైబడిన వృద్ధులు, పదేళ్ల లోపు పిల్లలే కనిపిస్తారు. మధ్య వయస్కులు కనిపించే గ్రామాలు చాలా తక్కువ ఉంటాయి. సరైన నీటి సదుపాయం లేకపోవడంతో వ్యవసాయం కూడా అంతంత మాత్రంగాానే ఉంటుంది. 


అదే ప్లస్ అదే మైనస్


ఇద్దరు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో పోరు హోరాహోరీగా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. సామాజిక పరంగా విజయకు కాస్త మద్దతు ఉన్నప్పటికీ సాయిరాజ్‌ నేపథ్యాన్ని చూసిన వారంతా మద్దతు తెలిపేందుకు వెనుకంజ వేస్తున్నట్టు వైసీపీ శ్రేణులే చెబుతున్నారు. ఇక్కడ మూడు  సామాజిక వర్గాలు అభ్యర్థి విజయాన్ని డిసైడ్ చేస్తాయి. అందుకే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి కళింగులను, నర్తు రామారావుకు ఎమ్మెల్సీ ఇచ్చి యాదవులను, ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చి రెడ్డిక వర్గాలను వైసీపీ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసింది. 


అధినాయకత్వం ఆలోచన ఒకలా ఉంటే..క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలాా ఉంది. నర్తు రామారావు, నరేశ్ కుమార్ అగర్వాల్, నర్తు నరేంద్ర, పిరియా సాయిరాజ్ ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారని కేడర్ చెప్పుకుంటోంది. గతంలో ఓటమికి ఇదే ప్రధాన కారణం అయిందని ఇప్పుడు అదే బాటలో నేతలు వెళ్తున్నారనే విమర్శ ఉంది.


8 సార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2,67,953 మంది ఓటర్లు  ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్‌ విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్ పై 7,145 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  జనాభా పరంగా రెడ్డిక, యాదవ, మత్సకార సామాజిక వర్గాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో  కళింగ, బెంతు ఒడియా, శ్రీశయన సామాజిక వర్గాలు ఉన్నాయి. టీడీపీ ఏర్పాటు తరువాత ఇచ్ఛాపురం...ఆ పార్టీకి కంచుకోటగా మారింది. 1983 నుంచి ఇప్పటికు 9 సార్లు ఎన్నికలు జరిగితే...ఎనిమిది సార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందాయి. 2004లో మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థి నరేష్‌ కుమార్‌ అగర్వాల్‌...తెలుగుదేశం పార్టీపై గెలుపొందారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న బెందాళం అశోక్‌, పిరియా సాయిరాజ్‌ కుటుంబాలు రెండు...కళింగ సామాజిక వర్గానికి చెందిన వారే.