Afghanistan Crisis Live Updates: కాందహార్ చేరుకున్న ముల్లా అబ్దుల్ బరదార్ సహా 8 మంది తాలిబాన్ నాయకులు
దేశంలోని ప్రజలకు తాము క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు యథావిధిగా విధుల్లో చేరాలని సూచించారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారమే మహిళలకు హక్కులు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
తాలిబాన్ కమాండర్, హక్కానీ నెట్‌వర్క్ తీవ్రవాద గ్రూపు సీనియర్ నాయకుడు అనాస్ హక్కానీ, ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌ని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై కర్జాయ్‌తో చర్చించినట్టు TOLO న్యూస్ చెప్పింది.
తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తరువాత దాదాపు 3200 మందిని దేశం నుంచి బయటకు తరలించామని యూఎస్ మిలిటరీ తెలిపింది. అందులో మంగళవారం ఒక్కరోజు 1100 మందిని సురక్షితంగా అఫ్గాన్ నుంచి తరలించామని వైట్ హౌస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
తాలిబన్ సంక్షోభంపై ఆగస్టు 24న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక సమావేశం నిర్వహంచనుంది. అఫ్గాన్‌లో తాలిబన్ల నుంచి అక్కడి పౌరులు ఎదుర్కొంటున్న మానవ హక్కుల ఉల్లంఘనపై కీలకంగా చర్చ జరగనుంది.
అఫ్గాన్‌లో పరిస్థితులపై కెనడా ప్రభుత్వం స్పందించింది. తాలిబన్లను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంగా తాము పరిగణించడం లేదని కెనడా స్పష్టం చేసింది. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకున్నారని మాత్రమే తాము భావిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.
తమ భావజాలం, విశ్వాసాలు గతంలో మాదిరిగానే ఉన్నాయని తాలిబన్ నేతలు చెబుతున్నారు. 1990లో ఉన్నట్లుగానే తమ భావజాలం ఉందని.. అయితే కేవలం తమ ఆలోచనలు, విధానాలలో మాత్రమే మార్పులు వచ్చాయని తాలిబన్లు వెల్లడించారు. గతానికి.. ప్రస్తుతం తాలిబన్లలో ఎలాంటి మార్పులొచ్చాయని అడిగిన ప్రశ్నకు వారి అధికార ప్రతినిధి ముజాహిద్ ఇలా బదులిచ్చారు.
తాలిబన్లకు ప్రత్యేక, వ్యక్తిగత మీడియా అవసరం ఉందని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు. అఫ్గాన్ ప్రయోజనాలకు జర్నలిస్టులు వ్యతిరేకంగా పనిచేయకూడదని హెచ్చరించారు. మీడియా తమ పని తాము చేసుకోవాలి. అందుకు మూడు షరతులు విధించారు. ఇస్లామిక్ విలువలకు కట్టుబడి ఉండాలి. జాతీయ భద్రత, గోప్యతకు విఘాతం కలిగించకూడదు. పాక్షికంగా మాత్రమే విషయాలు ప్రజలకు అందించాలని ముజాహిద్ స్పష్టం చేశారు.
Background
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకోవడంతో దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ప్రాణ భయంతో భయాందోళనకు గురవుతున్నారు. విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ క్రమంలో తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రజలకు తాము క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు యథావిధిగా విధుల్లో చేరి.. పనులు చేసుకోవాలని సూచించారు. మహిళలకు సైతం తమ ప్రభుత్వంలో అవకాశాలు ఉన్నాయని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని మీడియాతో మాట్లాడుతూ తాలిబన్ నేతలు ప్రకటన చేశారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారమే మహిళలకు హక్కులు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -