Aero India 2023:
ఎలహంకలో షో..
బెంగళూరులో జరుగుతున్న Aero India షోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీలో భారత్ గ్లోబల్ హబ్‌గా మారనుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని. ఇలాంటి కార్యక్రమాలు భారత దేశ
"ఆత్మ విశ్వాసానికి" ప్రతీకగా నిలుస్తాయని స్పష్టం చేశారు. బెంగళూరులోని ఎలహంకలో ఎయిర్ బేస్ స్టేషన్‌లో ఈ షో జరుగుతోంది.
"బెంగళూరు ఎయిర్ బేస్ నవ భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. దేశ ఎదుగుదలకు ఇదే సంకేతం. భారత్ ఉన్నత స్థానాలకు చేరుకుంటోంది. భారత్ ఎదుగుతోందనడానికి Aero India 2023 ఓ ఉదాహరణ. 100కి పైగా దేశాలు ఈ షోలో పాల్గొంటున్నాయి. అనూహ్య స్థాయిలో 700 మంది ఎగ్జిబిటర్‌లు ఈ షో కోసం రావడం వల్ల గత రికార్డులన్నీ బ్రేక్ అయిపోయాయి. భారత దేశంలో కొత్త దిశలో పయనిస్తోంది. ఇది కేవలం ఓ షో మాత్రమే కాదు. భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని చూపించే వేదిక."
ప్రధాని నరేంద్ర మోదీ
ఆత్మనిర్భరత..
ఆత్మనిర్భర భారత్ గురించీ ప్రస్తావించారు మోదీ. సూరత్, తుంకూర్‌లో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల తేజస్, INSవిక్రాంత్ లాంటి అస్త్రాలను తయారు చేసుకోగలుగుతున్నామని చెప్పారు. డిఫెన్స్ కంపెనీలకు భారత్ ఓ మార్కెట్‌గా ఉండేదని, ఇప్పుడు పార్ట్‌నర్‌గా మారిందని కొనియాడారు. రక్షణ రంగ అవసరాల కోసం పలు దేశాలు భారత్ వైపు చూసే రోజు వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏరో ఇండియా షోతో అవకాశాలు వెల్లువెత్తుతాయని అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ "మేక్ ఇన్ ఇండియా" నినాదం మేరకు ఈ షో ని గ్రాండ్‌గా ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం 5 రోజుల పాటు ఈ షో కొనసాగనుంది. ఎయిర్‌బస్, బోయింగ్, డస్సో ఏవియేషన్, ఇజ్రాయేల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, బ్రహ్మోస్ ఏరోస్పేస్...ఇలా ఎన్నో కంపెనీలు విన్యాసాలు చేయనున్నాయి.