Adilabad Rims Junior Doctors Ceased Protest: ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) లో మెడికోలు (Medicos) శనివారం సమ్మె విరమించారు. బయటి వ్యక్తులు తమపై దాడి చేశారని, వారిని కఠినంగా శిక్షించాలని గత 4 రోజులుగా వైద్య విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిమ్స్ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు (Junior Doctors) విధులు బహిష్కరించారు. డైరెక్టర్ ను మార్చాలని డిమాండ్ చేశారు. కాగా, శనివారం విచారణ కమిటీలు, వైద్య విద్యార్థులకు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో ఆందోళన విరమిస్తున్నట్లు మెడికోలు ప్రకటించారు. ముఖ్యంగా తమ 15 డిమాండ్లను నెరవేర్చాలని కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో తిరిగి ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఇదీ జరిగింది
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో బుధవారం అర్ధరాత్రి వైద్య విద్యార్థులపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. రిమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న క్రాంతి కుమార్ కొందరి బయటి వ్యక్తులను తీసుకొచ్చి మెడికోలపై దాడికి పాల్పడగా పలువురికి గాయాలయ్యాయి. దీంతో వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జూనియర్ డాక్టర్లకు నచ్చచెప్పిన వినలేదు. ఈ క్రమంలో రిమ్స్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. గాయపడిన మెడికో కవిరాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్, వసీం ఇతరులపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వైద్య విద్యార్థులపై దాడి ఘటనకు సంబంధించి కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. గురువారం రిమ్స్ కళాశాలను సందర్శించిన కమిటీ ఘటనకు సంబంధించి ఆరా తీశారు. బయటి వ్యక్తులు లోపలికి రాకుండా రిమ్స్ లో భద్రత పెంచుతామని డైరెక్టర్ తెలిపినా వైద్య విద్యార్థులు శాంతించలేదు. డైరెక్టర్ ను మారిస్తేనే అందరికీ సరైన న్యాయం జరుగుతుందని పట్టుబట్టారు.
ఐదుగురి అరెస్ట్
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం కలిగించగా, వైద్య విద్యార్థులు విధులకు దూరంగా ఉంటూ ఆందోళన నిర్వహించారు. అత్యవసర సేవలకు తప్ప మిగిలిన సేవలకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. ఘటనపై విచారించిన పోలీసులు రిమ్స్ ప్రొఫెసర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. రిమ్స్ హాస్టల్ ఆవరణలోకి బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడి చేయించిన ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్ ను టర్మినేట్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనలు కొనసాగుతుండగా, తాజాగా కమిటీలతో వైద్య విద్యార్థులు చర్చలు సఫలం కావడంతో నిరసన విరమించారు.
Also Read: Telangana News: 'ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలి' - బస్సుకు అడ్డంగా నిలబడి యువకుడి నిరసన, ఎక్కడంటే.?