Yusuf Pathan Vs Adhir Ranjan Chowdhury: పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల బరిలోకి తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే దిగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని భావించినా అదేమీ లేదని చాలా స్పష్టంగా చెప్పారు మమతా బెనర్జీ. మొత్తం 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. దీదీతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పిన కాంగ్రెస్ ఈ జాబితా ప్రకటించిన తరవాత అసహనానికి గురైంది. ముఖ్యంగా బెరహంపూర్‌లో (Berhampore) యూసుఫ్ పఠాన్‌ని నిలబెట్టడం మరింత అలజడి పెంచింది. సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టి కొత్త వాళ్లకి అవకాశమివ్వాలని భావించారు మమతా బెనర్జీ. అందుకే...క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కి టికెట్ ఇచ్చారు. అయిత...బెరహంపూర్ నియోజకవర్గం కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉంది. అధిర్ రంజన్ చౌదరి ఇక్కడి నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంత కీలకమైన చోట పఠాన్‌ని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్‌ని మరింత కవ్వించినట్టైంది. యూసుఫ్ పఠాన్ 2021లోనే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకున్నాడు. స్పిన్నర్‌గా, హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న పఠాన్...57 ODIలు, 22 టీ 20లు ఆడాడు. 2007లో T20 World Cup కీ ఆడాడు. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. బెరహంపూర్‌లో ఈ సారి యూసుఫ్ పఠాన్ వర్సెస్ అధిర్ రంజన్ చౌదరి పోటీ కనిపించనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అధిర్ రంజన్ చౌదరి ఇక్కడి నుంచే పోటీ చేసి 80 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఈ సారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అధిర్ రంజన్.
యూసుఫ్ పఠాన్‌ని బెహరంపూర్ నుంచి నిలబెట్టడంపై అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ పఠాన్‌ని గౌరవించుకోవాలని అనుకుంటే రాజ్యసభ ఎన్నికల బరిలో నిలబెట్టి ఉంటే బాగుండేదని అన్నారు. బెంగాల్ తరపున రాజ్యసభకు స్థానికేతరులకు అవకాశమిస్తున్నారని విమర్శించారు.
"ఒకవేళ యూసుఫ్ పఠాన్‌ని గౌరవించాలనుకుంటే రాజ్యసభ ఎన్నికల బరిలోకి దింపాల్సింది. రాజ్యసభకు స్థానికేతరులను పంపిస్తున్నారు. మమతా బెనర్జీ ఓ మాట చెప్పి ఉంటే మా కూటమి తరపున గుజరాత్‌లో పఠాన్‌కి టికెట్ కేటాయించే వాళ్లం. కానీ ఇప్పుడు పఠాన్‌కి టికెట్ ఇచ్చి బీజేపీకి మంచి చేయాలని దీదీ చూస్తున్నారు. కాంగ్రెస్‌ని ఓడించాలన్నదే ఆమె లక్ష్యం. ఇలాంటి నేతని ఎవరూ నమ్మకూడదు. ఇండియా కూటమిలో ఉంటే ప్రధాని మోదీ పట్టించుకోరన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు. మా కూటమిని విడగొట్టాలనుకుంటున్నారు"
- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ