Adani Issue:
రాహుల్‌పై విమర్శలు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. అదానీ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మండి పడ్డారు. "ఆయనకు ఇదే పని" అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ చేసే ఆరోపణలన్నీ అవాస్తవాలే అని తేల్చి చెప్పారు. బెంగళూరులోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా ఈ వ్యాఖ్యలు చేశారు.
"అదానీకే అన్ని అప్పజెప్తున్నారని రాహుల్ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. నిరాధారణ ఆరోపణలు చేయడం రాహుల్‌కు అలవాటైపోయింది. ప్రధాని మోదీపై బురద జల్లాలని చూస్తున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలోనూ ఇదే జరిగింది. మళ్లీ ఇప్పుడు అదే చేస్తున్నారు. ప్రధానిపై చేసేవన్నీ అసత్య ఆరోపణలు అని గట్టిగా చెబుతున్నా రాహుల్ వాటిని ఖాతరు చేయడం లేదు. ఆయనకు ఎదురైన అనుభవాల నుంచి ఏ పాఠమూ నేర్చుకోవడం లేదు"
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
కేరళ ప్రభుత్వం కూడా అదానీకి కీలక ప్రాజెక్టులు అప్పగించినప్పుడు రాహుల్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు నిర్మలా సీతారామన్. రాజస్థాన్‌లోనూ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అదానీ కంపెనీకే కట్టబెట్టినప్పుడు ఏం చేశారని నిలదీశారు.
"కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విరింజం పోర్ట్‌ను అదానీకి కట్టబెట్టారు. ఎలాంటి టెండర్ లేకుండానే ఆ కంపెనీకి అప్పగించారు. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ లేదు. సీపీఎం ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి...కేరళలోని ఆ ప్రాజెక్ట్‌పై రాహుల్ ఎందుకు నోరు మెదపడం లేదు. ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేయొచ్చు కదా..? కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో సోలార్ ప్రాజెక్ట్‌ను అదానీ కంపెనీకి అప్పగించారు. దాన్ని రాహుల్ ఎందుకు అడ్డుకోలేదు. దీనిపై ప్రశ్నించకుండా ఆయనను ఎవరు అడ్డుకున్నారు..? "
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
అటు విపక్షాలు అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని పట్టు పడుతున్నాయి. ప్రధాని మోదీ-అదానీ మధ్య సంబంధం ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నాయి. అదానీ-హిండెన్‌బర్గ్‌పై చర్చించేందుకు మోదీ సర్కార్ ఎందుకు భయపడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప.. ప్రధానికి ప్రజల కష్టాలు పట్టవన్నారు. పార్లమెంట్‌లో ప్రశ్నించకుండా బీజేపీ అడ్డుకుందని, సభలో ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. మోదీ ప్రజాస్వామ్యం గురించి ఎక్కువగా మాట్లాడుతారు కానీ చర్యల్లో అది కనిపించడం లేదన్నారు. ఇది ఏ రకంగానూ రాజకీయం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తామంతా ఐక్యంగా పోరాడుతున్నామని ఖర్గే స్పష్టం చేశారు.
Also Read: Hindu Temple Vandalised: కెనడాలో హిందూ ఆలయాలపై ఆగని దాడులు, గ్రాఫిటీతో అభ్యంతరకర రాతలు