ABP Southern Rising Summit: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటన గురించి ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే ఆయన ఏ పాత్ర చేసినా నటించరు జీవించేస్తారు. అందుకే ఆయనకు దేశంలోని అన్ని భాషల  నుంచి అవకాశాలు వస్తూంటాయి. అయితే నటన పరంగానే కాదు ఆయన దేశంలో ఓ రెబల్ లీడర్ గా గుర్తింపు పొందారు. ఆ లీడర్ అనేది రాజకీయంగా విజయాలను అందించకపోవచ్చు కానీ జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆయన వేసే ప్రశ్నలు రాజకీయ నేతల్ని,సామాన్య  ప్రజల్ని కూడా చర్చించుకునేలా చేస్తాయి. సామాజిక బాధ్యత, దేశాభివృద్దిపై అవగాహన మెండుగా ఉన్న ఆయన ఇటీవలి కాలంలో పలుమార్లు జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నించారు. 


కర్ణాటకలో రచయిత గౌరీ లంకేష్ హత్య తర్వాత ఆయన ఎక్స్‌ట్రీమ్ భావజాలానికి వ్యతిరేకంగా తన గళం విప్పుతున్నారు. అధికార పెద్దలకు ఆయన భయపడరు. తాను అడగాల్సింది అడిగేస్తారు. అయితే ఆయన తాను తన భావజాలన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యారు. బెంగళూరు నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి కనీస ఓట్లు తెచ్చుకోలేకపోయారు. తర్వాత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నిలబడిన తోటి ఆర్టిస్టులు కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకోలేదు. ఇలా ఎందుకు జరిగిందో ప్రకాష్ రాజ్ విశ్లేషించుకునే ప్రయత్నం చేశారో లేదో స్పష్టత లేదు.


మతతత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని గట్టిగా చెప్పే ప్రకాష్ రాజ్ మరి తన భావాలకు అనుకూలంగా ఉండే పార్టీలో చేరుతారా అన్న ప్రశ్నకు ఇప్పటి వరకూ సమాధానం  రాలేదు. ఆయన ఇప్పటికీ సినిమాల్లో  బీజీగా ఉన్నారు. కానీ తన వాయిస్ ను వినిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన భవిష్యత్ లో అయినా బలంగా ఉన్న పార్టీల ద్వారా తన రాజకీయ అడుగులు వేస్తారా అన్నది ప్రజలకు ఉన్న సందేహం. ఆయనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్ సహా పలువురితో మంచి సంబంధాలు ఉన్నాయి. అన్ని  రాష్ట్రాల్లోనూ గుర్తింపు ఉంది. ఆయన ఓకే అనాలి కానీ ఏ పార్టీలో అయినా పోటీ చేయడానికి అవకాశం వస్తుంది. 



కానీ ప్రకాష్ రాజ్ మాత్రం.. రాజకీయ పదవులే తన లక్ష్యం కాదని.. తన వాదనను.. మత తత్వానికి వ్యతిరేకంగా బలంగా వినిపించడమే తనకు ముఖ్యమంటున్నారు. అసలు తన జస్ట్ ఆస్కింగ్‌లో రాజకీయ కోణమే ఉండదంటున్నారు. తన అభిప్రాయాలను, ఆలోచలను.. దక్షిణాది రాజకీయ పయనాన్ని విశ్లేషించేందుకు  ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తున్న "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"కు విశిష్ట అతిథిగా వస్తున్నారు. అక్టోబర్ 25వ తేదీన ఉ.10 గంటల నుంచి ఏబీపీ నెట్ వర్క్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల మీద "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"ను వీక్షించవచ్చు.