ABP Cvoter Tamil Nadu Exit Poll 2024: దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల తరవాత తమిళనాడు రాజకీయాలే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ద్రవిడ మూలాలున్న రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు తప్ప జాతీయ పార్టీలకు ఏ మాత్రం ఉనికి ఉండదు. అయినా సరే బీజేపీ పట్టువదలకుండా ఇక్కడ ఉనికి చాటుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. కానీ...ప్రతిసారీ అక్కడ వెనకబడుతూనే ఉంది. ఈ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్ అంచనాల్లోనూ బీజేపీ తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదని తేలింది. తమిళనాడులో మొత్తం 39 ఎంపీ స్థానాలున్నాయి. ఇందులో I.N.D.I.A కూటమికే 37-39 వరకూ వస్తాయని ABP Cvoter Exit Poll 2024 అంచనా వేసింది. బీజేపీకి 0-2 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. అంటే బీజేపీ అసలు ఖాతా తెరవకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే స్థాయిలో ఉన్నాయి ఈ అంచనాలు. నిజానికి ఈ ఏడాదిలో తరచూ తమిళనాడులోనే పర్యటించారు ప్రధాని మోదీ. ద్రవిడ పార్టీల పోటీని తట్టుకుని నిలబడేందుకు గట్టిగానే ప్రయత్నించారు. అయితే..అంతకు ముందు వరకూ AIDMKతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది బీజేపీ. కానీ గతేడాది AIDMK బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఫలితంగా...ఉన్న ఆ కాస్త ఉనికి కూడా కోల్పోయినట్టైంది. ఈ కారణంగానే ఓటర్లకు దూరమై ఉండొచ్చన్న వాదనా ఉంది. పైగా బీజేపీ అంటే పూర్తిగా హిందూవాద పార్టీ అని, హిందీని తమపై బలవంతంగా రుద్దాలని చూస్తోందని తమిళనాడులో ఓ భావన బలంగా నాటుకుపోయింది. 


ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఒకటే ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. అందుకే...ఈసారి ఆ సంఖ్యని పెంచుకోవాలని చాలా గట్టిగానే ప్రయత్నించింది. అందులో భాగంగానే మోదీ "తమిళ వాదానికి" ప్రాధాన్యతనిస్తున్నట్టుగా సంకేతాలిచ్చారు. పదేపదే రాష్ట్రంలో పర్యటించడమే కాదు. కాశీ తమిళ సంగం, సౌరాష్ట్ర తమిళ సంగం కార్యక్రమాలకూ హాజరయ్యారు. అంతే కాదు. తమిళ చరిత్రతో ముడి పడి ఉన్న Sengol ని పార్లమెంట్ భవనంలో ప్రతిష్ఠించారు. తమిళ సంస్కృతి బీజేపీ ఎంతగా ప్రాధాన్యత ఇస్తోందో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ...తమిళనాడు రాజకీయాలపై ఇవేవీ పెద్దగా ప్రభావం చూపించినట్టుగా కనిపించడం లేదు. ఇప్పుడు ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్‌ పోల్‌ 2024 లెక్కలు చూస్తే అదే అర్థమవుతోంది.