ABP Cvoter Exit Poll Results 2024: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడందరూ ఎగ్జిట్ పోల్స్ గురించే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి..అన్న లెక్కలపై పెద్ద చర్చే జరుగుతోంది. గతంతో పోల్చి చూస్తే ఈ సారి ఎగ్జిట్ పోల్స్‌పై ఆసక్తి రెట్టింపైంది. ఈ క్రమంలోనే ABP CVoter Exit Poll 2024 అంచనాలు వెలువడ్డాయి. రాష్ట్రాలు, కేంద్రప్రాంతాల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశముందో అంచనా వేసింది ఈ ఎగ్జిట్ పోల్. మొత్తం లెక్కలు చూస్తే NDA కూటమి గరిష్ఠంగా 396, కనిష్ఠంగా 339 సీట్లు గెలుచుకునే అవకాశముందని ఎగ్జిట్ పోల్ తెలిపింది. ఇండీ కూటమి కనిష్ఠంగా 122, గరిష్ఠంగా 167 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. రాష్ట్రాల వారీగా లెక్కలు చూస్తే ఏపీలో NDA కూటమికి 21-25 సీట్లు వచ్చే అవకాశముందని వెల్లడించింది ABP CVoter Exit Poll. ఇతరులకు 0-4 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌కి 7-9 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అటు బీజేపీకి కూడా 7-9 స్థానాలు దక్కించుకునే అవకాశముంది. ఇతరులు ఒక్క స్థానానికే  పరిమితం కానున్నారు.



 


అరుణాచల్‌ ప్రదేశ్‌లో I.N.D.I.A కూటమి ఖాతా తెరిచే అవకాశమే లేదని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఉన్న 2 స్థానాలనూ NDA కైవసం చేసుకుంటుందని తెలిపింది. అసోంలో ప్రతిపక్ష కూటమి 2-4 సీట్లు గెలుచుకుంటుందని, NDA 10-12 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. ఢిల్లీ విషయానికొస్తే...ప్రతిపక్ష కూటమి I.N.D.I.A కూటమికి 1-3 స్థానాలు వచ్చే అవకాశముంది. అటు NDA కూటమి 4-6 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఇక ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో NDA 25-26 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. ప్రతిపక్ష కూటమి ఒక్క స్థానానికే పరిమితం కానుంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి 23-25 చోట్ల గెలుస్తుందని ఎగ్జిట్‌ పోల్‌ తెలిపింది. NDA కూటమికి 22-26 స్థానాలు వచ్చే అవకాశముంది. ఇక 80 ఎంపీ స్థానాలున్న యూపీలో ఇండీ కూటమి 15-17 స్థానాలు గెలుచుకుంటుందని, NDA 62-66 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. 




రాజస్థాన్‌లో ప్రతిపక్ష కూటమికి 2-4 స్థానాలు వస్తాయని, NDA కి 21-23 సీట్లు వచ్చే అవకాశముందని స్పష్టం చేసింది. దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన తమిళనాడులో ఈ సారి కూడా NDA కి చుక్కెదురవుతుందని ఎగ్జిట్ పోల్‌ లెక్కలు చెబుతున్నాయి. అక్కడ ఈ కూటమికి 0-2 స్థానాలకే పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనా వేస్తున్నాయి. I.N.D.I.A కూటమికి 37-39 స్థానాలు వస్తాయని తెలిపింది. మరో సౌత్‌ స్టేట్ కర్ణాటకలో NDA కూటమి 23-25 స్థానాలు గెలుచుకుంటుందని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్‌ పోల్ అంచనా వేసింది. ప్రతిపక్ష కూటమి 3-5 స్థానాలకే పరిమితం కానుంది. కేరళలో NDA కేవలం 1-3 స్థానాలకే పరిమితం కానుంది. అధికార కూటమి 17-19 స్థానాలు దక్కించుకోనుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.  మధ్యప్రదేశ్‌లో ప్రతిపక్ష కూటమి 1-3 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. NDA 26-28 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది. 


ఛత్తీస్‌గఢ్‌లో ఇండీ కూటమికి 0-1 స్థానాలు దక్కుతాయని, NDA కూటమి 10-11 సీట్‌లు గెలుచుకుటుందని అంచనా వేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో NDA కూటమి 3-4 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అంటే ఇక్కడ క్లీన్‌ స్వీప్ చేసే అవకాశాలున్నాయి. పంజాబ్‌లో ఇండీ కూటమి 6-8 స్థానాలు, NDA కూటమి 1-3 స్థానాలు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్‌ అంచనాలు తెలిపాయి. ఇక అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్‌లో ఇండీ కూటమి 1-3 స్థానాలకే పరిమితం అవుతుందని, NDA కూటమి 23-27స స్థానాలు గెలుచుకుటుందని అంచనా వేసింది. 


ఓటింగ్ షేర్ అంచనాలు ఇవే..


ఆంధ్రప్రదేశ్‌లో NDAకి 52.9%,అధికార వైఎస్‌ఆర్‌సీపీ పార్టీకి 41.7% ఓట్లు పోల్ అవుతాయని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెలంగాణలో కాంగ్రెస్‌కి 38.6%,బీజేపీకి 33% ఓట్లు పోల్‌ అయ్యే అవకాశముందని తెలిపింది. ఇక బీఆర్‌ఎస్‌కి కేవలం 20.3% ఓట్లు పోల్‌ అవుతాయని అంచనా వేసింది. తమిళనాడులో I.N.D.I.A కూటమికి 46.3%, బీజేపీకి 18.9% ఓట్లు పోల్‌ అవుతాయని తెలిపింది. AIDMK కి 21% ఓట్లు పోల్ అయ్యే అవకాశాలున్నాయి. కర్ణాటకలో ప్రతిపక్ష కూటమికి 41.8% ఓట్లు, NDAకి 54.2% ఓట్లు పోల్ అవుతాయని వెల్లడించింది.